హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తే .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ధరలు తగ్గిస్తాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, పలువురు గ్రాడ్యుయేట ఓటర్లతో మాట్లాడుతూ, బీజేపీ సర్కార్ సిలిండర్ ,పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారం పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందన్నారు. 2004లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ కు 110 డాలర్లు ఉంటే అప్పట్లో పెట్రోలు ధర లీటర్ 70 రూపాయలు ఉండేదని.. కానీ అదే అంతర్జాతీయ ముడి చమురు ధర 56 డాలర్లు ఉంటే పెట్రోలు, డీజిల్, సిలిండర్ ధరలన్నీ తగ్గించాల్సిందిపోయి అన్ని ధరలు పెంచేశారని మండిపడ్డారు. . ఒక్క పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల సమాజంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఏ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు సీటు ఇవ్వలేదని,, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈసారి ఓ గిరిజనుడికి అవకాశం కల్పించారని అన్నారు. రాములు నాయక్ గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో రాములు నాయక్ చిత్తశుద్ది తో పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ నిరంకుశ ధోరణి నచ్చక టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారని తెలిపారు. అన్ని పార్టీలు రెడ్లకే సీట్లు ఇచ్చాయని, ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఎస్టీ కి టికెట్ ఇచ్చిందనే విషయాన్ని అన్ని వర్గాలు గుర్తించి ఆదరించాలని ఆయన కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement