హైదరాబాద్ ( ఆంధ్రప్రభ ప్రతినిధి ) : ఉపమానాలకి, ఉదాహరణలకీ అందని ఉదాత్తమైన వజ్ర సదృశ విలక్షణ గళం ‘ ఉషశ్రీ ‘ దని, మూడు దశాబ్దాలపాటు ఆకాశవాణిలో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం ఉషశ్రీ అసాధారణ వాగ్వైభవంలో రామాయణ భారతాలు విని లక్షల శ్రోతలు పరవశించిపోయారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వ పూర్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ఉషశ్రీ జయంతి సందర్భగా ఉషశ్రీ మిషన్ వారి సమర్పణలో ఋతువర్ణనలా సౌందర్యాన్ని విరజిమ్ముతూ రూపు దిద్దుకున్న ‘మహా సౌందర్యం’ స్తోత్ర వైభవ గ్రంధాన్ని ఆయన థన్ ఛాంబర్లో ఆవిష్కరించారు.
మహా సౌందర్యం పేరిట శైవ , వైష్ణవ, గాణపత్య, శాక్తేయ విభాగాలుగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ఎప్పటిలానే క్రొత్త అందాలతో, రసమయ రమణీయ కమనీయ వ్యాఖ్యానాలతో నాల్గు భాగాలుగా విడుదల చేశారు. వివిధ సందర్భాలలో ఈ నాలుగు సంచికలను యాదాద్రి మహాక్షేత్ర డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జి.కిషన్ రావు , తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణీ సదాశివమూర్తి, తిరుమల మహాక్షేత్రం ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, భారతదేశ పర్యాటక శాఖామంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిషకరించారు.
అయితే ఈ ఐదవ ప్రత్యేక సంచిక పేరుకూడా మహాసౌందర్యమే కావడం గమనార్హం. రేడియో ఉషశ్రీకి నివాళి అర్పిస్తూ ఉషశ్రీ మిషన్ సమర్పణలో విడుదలైన ఈ అద్భుత సంచిక వైదిక సంస్కృతీ విలువలతో అత్యంత తేజోమయంగా ఉందని , మరీ ముఖ్యంగా ఆలయాల పండిత అర్చకులకీ, వేదపాఠశాలల విద్యార్థులకూ మాత్రమే కాకున్నా తెలుగు భక్త పాఠకలోకానికి చాలా చక్కగా ఉపయుక్తమయ్యేలా పురాణపండ శ్రీనివాస్ విశిష్ట కృషి అడుగడుగునా దర్శనమిస్తోందని రమణాచారి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఉషశ్రీ మేలిమి విలువలను కొనసాగిస్తున్న కుమార్తెలను, ముఖ్యంగా నిర్మాణాత్మకమైన ఉషశ్రీ కార్యక్రమాన్ని ప్రతీ ఏటా ఉషశ్రీ సంస్కృతీ సత్కారం పేరిట నిరాఘాటంగా కొనసాగిస్తున్న ఉషశ్రీ కుమార్తె వైజయంతిని, అల్లుడు సుబ్రహ్మణ్యంని ప్రత్యేకంగా అభినందించారు. పురాణపండ శ్రీనివాస్ పై ఎప్పుడూ ఆప్యాయతను వర్షించే రమణాచారి ఈసారి కూడా ఈ ‘ మహాసౌందర్యం’ వెనుక ఉన్న పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలన సౌందర్యాన్ని , గ్రంథ నిర్మాణ సాహసాన్ని శ్రీనివాస్ ఉపాసనా బలంగా అభివర్ణించారు.
ఏది ఏమైనా ఇప్పటి మాహాత్ములైన చాగంటి కోటేశ్వర రావు, గరికపాటి నరసింహా రావు, సామవేదం షణ్ముఖ శర్మలకు ముందు చరిత్ర తెరిస్తే … గ్రామీణ ప్రాంతాల నుండీ నగరాలవరకూ వేలల్లో ఈనాటికీ ఉషశ్రీ అభిమానులు కనిపిస్తారనేది ఆకాశమంత నిజంగానే చెప్పాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనాత్మకంగా పండిత పామర లోకాన్నివేలకొలది గ్రంథ వైభవాలతో ఆశ్చర్య పరుస్తున్న అద్భుత వక్త, ప్రముఖ రచయిత , నిస్వార్ధ వ్యక్తిత్వం పురాణపండ శ్రీనివాస్ కూడా ఉషశ్రీ వంశానికి చెందిన వెలుగు రేఖే !
అయితే … జీవన యాత్రలో ఎదుర్కొన్న కష్టాల కాలంలో పురాణపండ శ్రీనివాస్ కి తిరుమల శ్రీనివాసుడే ఆపద్బాంధవునిగా నిలవడంతో … ఏనాడూ పెద్ద తరాలపేర్లు ఉపయోగించుకోకుండా స్వయంకృషి మంత్రంతోనే దివారాత్రాలు కష్టపడటం, వేంకటేశుని ముందు సాష్టాంగపడటం ఈ రెండే శ్రీనివాస్ కి ఇప్పుడు తెలుసున్న సత్యాలు. ఆచరిస్తున్న సత్యాలు. గత దశాబ్ద కాలంగా ఈ దేశంలో సుమారుగా మాన్ని రాష్ట్రాల తెలుగు పీఠాల, మఠాల , ఆలయాల ప్రాంగణాల్లో శ్రీనివాస్ మంగళమయ గ్రంధాలకున్న స్పందన ఉషశ్రీలాంటి పెద్దతరాల, శ్రీనివాస్ తల్లి తండ్రుల పుణ్యఫలమేనని నిస్సందేహంగా చెప్పాలని పండిత అర్చక వర్గాలు గొంతెత్తుతున్నాయి.