హైదరాబాద్, ఆంధ్రప్రభ : గంగా పుష్కరాల యాత్ర, పూరి-కాశి-అయోధ్య పేరుతో ద.మ.రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ-ఏపీలోని అన్ని స్టేషన్ల నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో మంగళవారం సికింద్రాబాద్ నుంచి రెండో భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరింది. భారత్ గౌరవ్ రైలు మూడో ట్రిప్ ఏప్రిల్ 29న 4వ ట్రిప్ మే 13న 5వ ట్రిప్ మే 27న ప్రారంభం కానున్నట్లు ద.మ.రైల్వే అధికారులు వెల్లడించారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుకు యాత్రికుల నుంచి అద్భుత స్పందన వస్తుండటం పట్ల ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హర్షం వ్యక్తం చేశారు.
తీర్థ యాత్రికులు ముందుగానే ప్రణాళిక వేసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించేందుకు ఈ రైలు ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలను సందర్శించడానికి ద.మ.రైల్వే ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రతతో కూడిన రైల్వే కోచ్‌లను సొంతం చేసుకోవడం లేదా లీజుకు తీసుకోవడం ద్వారా వివిధ నేపథ్యాలతో కూడిన పర్యటనలను నిర్వహించగలమన్నారు.
ఈ యాత్రకు రెండు తెలుగు రాష్ట్రాలలోని మొత్తం 9 స్టాపింగ్ స్టేషన్ల నుంచి యాత్రికుల నుంచి విశేషమైన ఆసక్తి కనబరచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ రైలు ద్వారా భక్తులు అతి తక్కువ ఖర్చుతో అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన పద్దతుల ద్వారా గమ్యస్థానాలను చేరుకుంటారని చెప్పారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఉద్దేశ్యాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా జీఎం జైన్ టూరిస్ట్ ఆపరేటర్లకు విజ్ఞప్తి చేశారు.