Saturday, November 23, 2024

Big Story | పసుపు రైతుల పరేషాన్‌, ధరపైనే దిగాలు.. మరో 15 రోజుల్లో మార్కెట్‌ లోకి పసుపు

ఉమ్మడి నిజామాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: పసుపు సాగు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రతి ఏడాది పసుపు రైతుకు తిప్పలు తప్పడం. ఓ వైపు ప్రకతి భీభత్సం, మరోవైపు పాలకుల పట్టింపు లేని వ్యవహారం రైతులకు శాపమవుతోంది. పంట సాగు నుంచి మార్కెట్లో అమ్మే వరకు ఆందోళన తప్పడం లేదు. అనేక ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న పసుపు సాగును నిజామాబాద్‌ రైతులు కొనసాగిస్తున్నారు. అన్ని పంటలకు భిన్నంగా ఎంతో భక్తితో పసుపును సాగుచేస్తారు. ఒకప్పుడు పసుపు సాగుచేస్తే బంగారం పండినట్లుగా భావించేవారు. పసుపుకు డిమాండ్‌ కూడా ఎక్కువగా ఉండేది. క్రమేణా అంతర్జాతీయ మార్కెట్లో పసుపు డిమాండ్‌ పెరుగుతూ వచ్చినా… ధర మాత్రం తగ్గుతూ పోతుంది. ఈ పరిణామం రైతాంగాన్ని నిరాశకు గురిచేస్తోంది.

15 ఏళ్ల క్రితం క్వింటాలు పసుపు ధర రూ.18 వేలు పలికింది. ఈ ధర నేటికి రికార్డే. ఆ తరువాత రూ.10 వేల ధరకు అటు ఇటుగా మారినా, కొన్నేళ్లుగా రూ.6వేల నుంచి రూ.8 వేల మధ్యనే ఊగిసలాడుతోంది. ఈ ధర పసుపు రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. లాభం దేవుడెరుగు ప్రతీ సీజన్‌ లో నష్టాలు తప్పడం లేదని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా పసుపు ధరపై రైతులు దిగాలుగ వున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పసుపు సాగులో నిజామాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో పసుపు సాగు ఎక్కువగా జరుగుతుంది. నిజామాబాద్‌ జిల్లాలో 40 వేల ఎకరాల్లో, జగిత్యాలలో 20 వేల ఎకరాల్లో, నిర్మల్‌ జిల్లాలో 15 వేల ఎకరాల్లో పసుపు సాగవు తుంది. ఇటీవల సరిహద్దులోని మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పసుపు సాగు చేస్తున్నారు. కానీ గిట్టుబాటుధర ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

దెబ్బతిన్న పసుపుతో తగ్గిన దిగుబడి

అధిక వర్షాలతో పసుపు పంట దెబ్బతిన్నది. నీరు నిలిచి చీడపీడలు ఆశించడంతో దిగుబడి కూడా తగ్గిపోనుంది. ప్రతీ యేడు ధర లేక పోవడంతో రైతాంగం ఈసారి పసుపు పంట సాగు తగ్గించింది. దీనికి తోడు భారీ వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల పసుపు దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు చెబుతున్నారు. దిగుబడి ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రస్తుతం మార్కెట్లో గతేడు పసుపు క్వింటాలు ధర రూ.6500లు మాత్రమే పలుకుతుంది. గతయేడాది సీజన్‌ లో కనిష్టంగా రూ.5,500 లు పలుకగా, గరిష్టంగా రూ.8,200 లు పలికింది. అయిన ప్పటికీ రైతాంగానికి నష్టమే మిగిలింది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితి దష్ట్యా ధర రూ.8,500 దాటే అవకాశం లేదని వ్యాపారులు చెపుతున్నారు.

వ్యాపారులు నిర్ణయించిందే ధరగా వస్తోంది. నిజామాబాద్‌ మార్కెట్‌ లో ఈ న్ఖామ్‌ పద్ధతిన ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ ఎలాంటి లాభం లేకుండాపోయింది. ఆరు నెలలకు పైగా కష్టపడితే పంట చేతి కొస్తుంది. మరో నెలల రోజులు పసుపు తవ్వకాలు, ఉడకబెట్టడం, అర బట్టడం, కొమ్ము వేరు చేయడం, మార్కెట్‌ తరలించడం ఇలా కష్టపడితే గానీ పసుపు అమ్మ కాలు సాధ్యం కాదు. ఇంత కష్టంగా సాగుచేసే పంట మరొకటి లేదు. అయినా రైతుకు ఏమాత్రం లాభం చేకూరడం లేదు. సాగు ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎకరానికి రూ.లక్ష నుంచి లక్ష 20 వేల పైనే ఖర్చు అవుతోంది. రైతు శ్రమ, భూమి ఇలా లెక్కలు వేస్తే కనీసం క్వింటాలు ధర రూ.12 వేలు దాటితే కొంత లాభం ఉంటుంది. రైతులు మాత్రం రూ.15 వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రయోజనం చేకూర్చని స్పైస్‌ ప్రాంతీయ కార్యాలయం

పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనేది పసుపు రైతుల చిరకాల కోరిక. పసుపు బోర్డు ఒక్కటే సమస్యలన్నింటికి పరిష్కారమని గత 30 ఏళ్లుగా రైతాంగం పోరాటం చేస్తూనేవుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండానే కేంద్రం స్పైస్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పసుబోర్డు కంటే మేలైనదంటు చెబుతున్నప్పటికీ పసుపు రైతుకు ఏమాత్రం ప్రయోజనంగా లేకుండా పోయింది. ధర విషయంలో ఎంతమాత్రం మేలు జరగడం లేదు. పసుపు కొనుగోలులో కూడా ఎలాంటి తేడాలు లేవు.

మళ్ళీ రాజుకోనున్న పసుపు ఉద్యమం

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పసుపు బోర్డు డిమాండ్‌ తో రైతులు ఏకంగా పార్లమెంట్‌ అభ్యర్థులుగా 178 మంది నామినేషన్లు వేశారు. దేశ వ్యాప్తంగా పసుపు రైతుల సమస్య చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం పసుపుకు మద్దతు ధర, వాణిజ్య పంట నుంచి వ్యవసాయ పంటగా మార్చేందుకు రైతుల డిమాండ్‌ ను వ్యక్తం చేసింది. అయినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా, పసుపును ఇంకా వాణిజ్య పంట గానే కొనసాగిస్తుండడంతో రైతాంగం అసహనం వ్యక్తం చేస్తోంది.

గతంలో అనేకమైన పసుపు ఉద్యమాలు నిజామాబాద్‌ జిల్లాలో జరిగాయి. మళ్లి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పసుపు ఉద్యమం రాజుకునే అవకాశాలు ఉన్నాయి. 15 రోజుల్లో మార్కెట్లోకి పసుపు పసుపుకు నిజామాబాద్‌ మార్కెట్‌ తో పాటు మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడులోని ఈరోడ్‌ మార్కెట్లు ఉన్నాయి. మరో 15 రోజుల్లో పసుపు తవ్వకాలు మొదలై పసుపు కొమ్ము మార్కెట్లోకి రానుంది. నిజామాబాద్‌ మార్కెట్‌ కు సాంగ్లీ, ఈరోడ్‌ మార్కెట్లకు ధరల్లో క్వింటాలకు రూ.1000 వరకు తేడా ఉంటుంది. భారీగా పండించే రైతులు పసుపును సాంగీకి తరలిస్తుంటారు. ఇదిలావుంటే ఈసారి పసుపు దిగుబడి అన్ని చోట్ల కూడా తగ్గింది. ధర మాత్రం పెరిగే అవకాశాలు లేవు. అయితే గతంలో మార్క్ఫెడ్‌ ద్వారా పసుపును కొనుగోలు చేసినట్లుగా ఈసారి కూడా సేకరించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏమైనా కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డు ఏర్పాటు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పసుపు రైతుకు తీరని ఆవేదనను మిగిల్చుతోంది.

పసుపు బోర్డు ఏర్పాటే పరిష్కారం..

కోటపాటి నర్సింహానాయుడు, పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసుపు సమస్యలకు పసుపు బోర్డు ఏర్పాటే ఏకైక పరిష్కారం. అనేక ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. కేంద్రం బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించడం సిగ్గుచేటు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదు. కనీసం క్వింటాలుకు రూ. 15 వేలు మద్దతు ధర ఇవ్వాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement