Friday, November 22, 2024

ఇక తెలంగాణ సిటీ బ‌స్సుల‌లో ‘ఆర్టీసీ రేడియో’ మోత‌

హైద‌రాబాద్ – ఇప్ప‌టికే ఉన్న ఎఫ్ ఎం రేడియోల‌కు పోటీగా మ‌రో రేడియో కేంద్రం ప్ర‌సారాల‌ను ప్రారంభించింది.. ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాటు చేయ‌డం విశేషం.. ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొన‌సాగేందుకు బస్సుల్లో ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ను ఫైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ సిటీలోని 9రూట్ల‌లోని ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో కూకట్‌పల్లి డిపో బస్సులో ఈ రేడియోను ఆ సంస్థ‌ ఎండీ వీసీ సజ్జనర్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు.


ఫైలట్‌ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ రేడియో ప్ర‌యాణీకుల‌ను అల‌రించ‌నుంద‌ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఉప్పల్ – సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్ – సికింద్రాబాద్‌, గచ్చిబౌలి – మెహిదిపట్నం, సికింద్రాబాద్ – పటాన్‌చెరువు, కూకట్‌పల్లి – శంకర్‌పల్లి, కొండాపూర్ – సికింద్రాబాద్‌, కోఠి – పటాన్‌చెరువు, ఇబ్రహింపట్నం – జేబీఎస్‌ మార్గాల్లో న‌డిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్‌ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement