హైదరాబాద్, : గతుకుల రోడ్లపై ప్రయాణం చేస్తున్న ఆర్టీసీని కరోనా మహమ్మారి కోలుకోని విధంగా దెబ్బకొడుతోంది. గత ఏడాది లాక్డౌన్తో తల్లడిల్లిన ఆర్టీసీ మరోసారి కుదేలవుతోంది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావం ఆర్టీసీపై మరింతగా పడుతోంది. గాల్లోనూ కరోనా విస్తరిస్తోందని, భౌతిక దూరం తప్పనిసరని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. రోజువారి తప్పనిసరిగా విధులకు వెళ్ళాల్సిన వారు స్వంత వాహనాలలోనే ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో గత నెల రోజలుగా బస్సులన్నీ ఖాళీగా తిరుగుతున్నాయి.
ఆర్టీసీలో కార్గో బస్సులు పోను ప్రయాణికుల కోసం మొత్తం 6,579 బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇందు లోనూ ప్రయాణికులు తిరగక పోవడంతో రొద్ది రోజుల క్రితం అధికారులు వెయ్యి బస్సులు తగ్గించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కరోనా మరింత ప్రభావవంతంగా ఉండటంతో కొన్నిచోట్ల లాక్డౌన్, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించడంతో అటువైపు వెళ్లే బస్సుల సంఖ్య తగ్గించారు. ఇందుకు తోడుగా రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ పూర్తిగా బంద్ కావడం కూడా ఆదాయంపై ప్రభావం పడింది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా, 30 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ప్రైవేట్ వాహనాల వినియోగం పెరగడం, విద్యా సంస్థలన్నీ మూతపడటంతో రోడ్లపై తిరిగే వారి సంఖ్య కూడా తగ్గింది. దీంతో ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా పడిపోయింది. లాక్డౌన్ అనంతరం రోడ్లెక్కిన బస్సులలో కొద్ది రోజుల క్రితం వరకు 65శాతం నుంచి 67 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. ఇప్పుడు ఏకంగా 48శాతానికి పడిపోయింది. లాక్డౌన్ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆర్టీసీ గాడిన పడే పరిస్థితులు కనిపించాయి. అప్పుడు ఏకంగా సగటున రోజుకు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం బస్సులు, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆటోమేటిక్గా సంస్థకు కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో రోజువారీ కలెక్షన్స్ రూ. 4 కోట్లకు తగ్గి రూ.8 కోట్లకు పడిపోయింది.
2020లో కరోనాతో ఆర్టీసీ బస్సులు దాదాపు ఆరు మాసాల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత రోడ్డెక్కినా రెండు, మూడు నెలల పాటు ప్రయాణికులు ఆదరించలేదు. 2019 డిసెంబర్లో 85.27 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండగా, 2020 డిసెంబర్ 23.76 శాతానికి పడిపోయింది. మొత్తంగా 2020లో కరోనాతో ఆర్టీసీకి రూ.2400 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు అంటున్నారు. మరోసారి కరోనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండటంతో ఇప్పుడు రోజురోజుకు కలెక్షన్స్, ఓఆర్ పడిపోవడంపై ఆందోళన చెందుతున్నారు. డీజెల్ రేట్లు పెరిగాయని, జీతాలకు డబ్బులు కూడా రావడం లేదని వారు వాపోతున్నారు. ఆదాయం లేక నెలనెలా సర్కారు నుంచి తీసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.
తెలంగాణ ఆర్టీసికి కరోనా దెబ్బ…
Advertisement
తాజా వార్తలు
Advertisement