Tuesday, November 26, 2024

సాగ‌ర్ ఎన్నిక‌ల వేళ – క‌మ‌లానికి షాక్ లు…

కారెక్కిన కాషాయ నేతలు
సీఎం కేసీఆర్‌ సమక్షంలో అంజయ్యయాదవ్‌తో సహా భారీగా బీజేపీ నేతల చేరిక
అభ్యర్థి ఎంపికలో వికటించిన బీజేపీ వ్యూహం
సాగరంలో ఆసక్తికర రాజకీయం
జానా గతం… టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు అంటూ స్లోగన్

హైదరాబాద్‌, : నాగార్జునసాగర్‌ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ చాణక్యంతో.. సాగర్‌లో కమలానికి గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ కీలక నేత, టికెట్‌ ఆశించి భంగపడ్డ అంజయ్యయాదవ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షం లో గులాబీకండువా కప్పుకున్నారు. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగియగా, అభ్యర్ధి ఎంపిక విషయంలో కమలం వ్యూహం బెడిసికొట్టింది. ఇతరపార్టీల నుండి వలసలు రాకపోగా, సొంతపార్టీకి చెందిన నేతలు టికెట్‌ రానందుకు అలిగి, ఆగ్రహించి కారెక్కేశారు. టికెట్‌ విషయంలో.. ఆదినుండీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన గులాబీదళపతి కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌కు ఆఖర్లో షాకిచ్చే ఎత్తుగడలు అవలంభించి సక్సెస్‌ అయ్యారు. బీజేపీ టికెట్‌ ఆశించి నిరాశకు గురైన కడారి అంజయ్య యాదవ్‌ కాషాయపార్టీని వీడారు. సాగర్‌ ఉపఎన్నికలో కడారి టికెట్‌ ఆశించగా చివరి నిమిషంలో రవి నాయక్‌కు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరికపై అంజయ్యతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైలా శేఖర్‌రెడ్డి, రవీంద్ర నాయక్‌, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తంచేశారు. తన అనుచరగణంతో కలిపి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన అంజయ్య యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్‌, సైదిరెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్ళారు. ఫాంహౌస్‌లో కేసీఆర్‌ సమక్షంలో అంజయ్య యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు
వందలాది కార్యకర్తలు వెంట వెళ్ళగా, సీఎం కేసీఆర్‌ పా ర్టీలోకి స్వాగతించారు. ఇదే టికెట్‌ ఆశించి.. నామినేషన్‌ వేసి న నివేదితారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోం ది. బీజేపీ అధిష్టాననిర్ణయంపై ఆమెె ఆగ్రహంగా ఉన్నారు.
సీన్‌ రివర్స్‌
నాగార్జునసాగర్‌ అసెంబ్లి నియోజకవర్గంలో బీజేపీ – టీఆర్‌ఎస్‌ మధ్య సీన్‌ రివర్స్‌ అయింది. టీఆర్‌ఎస్‌ తమ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటిస్తే ఆ తర్వాత అసంతృప్త నేతలను లాక్కుని వారిలో ఎవరికో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే ఆ పార్టీ నుంచి ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడికే టీఆర్‌ఎస్‌ అవకాశం ఇచ్చింది. అసంతృప్తిగా ఉంటారనుకున్న కోటిరెడ్డికి సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఆఫర్‌ ఇవ్వడం, మరో ఎమ్మెల్సీకి రెన్యువల్‌ హామీ లభించడంతో వారిద్దరూ సంతోషంగా ఉన్నారు. దీంతో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ రవికుమార్‌ పేరును ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆ పార్టీ నేత అంజయ్య యాదవ్‌ తనకు టికెట్‌ వస్తుందని ఆశించి భంగపడ్డారు. తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంజయ్యయాదవ్‌కు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సంబంధాలు, గతంలో ఒకసారి పోటీచేసి 27వేల ఓట్లకు పైగా సాధించిన నేపథ్యం ఉండడంతో టీఆర్‌ఎస్‌ వెంటనే ఆకర్షించింది. ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌ నాయక్‌లు ఆయనతో మాట్లాడడంతో పాటు అధిష్టానంతో మాట్లాడి కార్పోరేషన్‌ ఛైర్మన్‌ ఇస్తామని హామీనిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ ఒకలా అనుకుంటే.. టీఆర్‌ఎస్‌ వేసిన మాస్టర్‌ప్లాన్‌తో ఇంకోలా జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అంజయ్యయాదవ్‌కు టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో నివేదితారెడ్డి కూడా.. టీఆర్‌ఎస్‌లో చేరికకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు కమలానికి కోలుకోలేని దెబ్బపడగా, దుబ్బాక..జీహెచ్‌ఎంసిల ఊపు మాయమైంది. ముందునుండీ కసరత్తు ప్రారంభించినా.. వ్యూహలోపం, కేసీఆర్‌ చాణక్యం ముందు తెల్లబోయింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిపెట్టిన నాటినుండే పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం వ్యక్తమవుతుండగా, రెండు స్థానాల విజయంతో క్యాడర్‌లో ఫుల్‌ జోష్‌ వచ్చింది. అదే జోష్‌ నాగార్జునసా గర్‌లోనూ కంటిన్యూ అవుతోంది. నాగార్జునసాగర్‌ విషయంలోనూ సీఎం ముందునుండీ అవలంభిస్తున్న వ్యూహాలు.. ఆసక్తికరంగా మారాయి. ఆఖరిరోజు వరకు టికెట్‌ విషయంలో ఎందుకు జాప్యం చేశారనే విషయం.. తాజాగా బీజేపీకి ఇచ్చిన షాక్‌తో క్యాడర్‌కు అర్ధమైంది. భారీ మెజారిటీతో సాగర్‌ కైవసం చేసుకుంటామని గులాబీనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముక్కోణం.. సామాజిక సమీకరణం
మూడు ప్రధాన పార్టీలు మూడు సామాజికవర్గాలకు చెందిన నేతలకు టికెట్లు ఇవ్వగా.. తెలంగాణలో తొలిసారి కులాల లెక్కలతో ఎన్నికల మంత్రాంగం నడుస్తోంది. ఇక్కడ రెడ్డిసామాజిక వర్గ ఓట్లు 24వేలు, యాదవుల ఓట్లు 36,646, లంబాడా ఓట్లు 34వేలు ఉన్నాయి. ఇది టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కాగా, నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్‌నే పార్టీ బరిలోకి దింపింది.
గత ఎన్నికల్లో బిసి యాదవ సమీకరణ లతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ తొలిసారి విజయభేరి మోగించింది. ఇపుడూ అదే సంప్రదాయం కొనసాగించింది. కాంగ్రెస్‌ నేత జానారెడ్డికి ఈ ప్రాంతంతో 40ఏళ్ళకు పైబడిన అనుబంధం ఉంది. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో కేవలం.. 2వేల పైచిలుకు ఓట్లు రాగా, ఈసారి ముందునుండే రకరకాల ప్రయత్నాలు చేసింది. అత్యధిక ఓటర్లున్న లంబాడ సామాజికవర్గానికి టికెట్‌ ఇచ్చింది. సామాజికవర్గ ఓట్ల పై ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మూడుపార్టీలు విభిన్న కులసమీకర ణలతో రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చాయి. ఇక ఇదే సందర్భంలో రాజకీయపార్టీలు సరికొత్త నినాదాలు ఎత్తుకున్నాయి. జానా గతం.. టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు అంటూ టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తుండగా, ఈ అభివృద్దికి కారణం ఎవరు అంటూ జానారెడ్డి తాను చేసిన ప్రగతిని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement