హైదరాబాద్ క్రికెట్ బోర్డు(హెచ్సీఏ)లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికలు జరిగి బోర్డు ఎంపిక పూర్తైనా… ఆరోపణలు రావటం, బోర్డు నుండి పలువురిని పక్కన పెట్టడం జరుగుతూనే ఉంది. తాజాగా అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్ ను పక్కనపెట్టేసింది. నిజానికి హెచ్సీఏలో ముందు నుండి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కొట్లాట సాగుతుంది. మాజీ ఎంపీ వివేక్ హెచ్సీఏ అధ్యక్ష బరిలో ఉన్న సమయంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ కవిత సపోర్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత బోర్డులో తన ఆధిపత్యం కోసం కవిత ప్రయత్నించారని, వీలైతే బీసీసీఐలో చక్రం తిప్పాలన్నది తన ఆలోచనగా ఆమె సన్నిహితులు కామెంట్స్ చేశారు.
కానీ ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం రాజకీయ నాయకులకు క్రికెట్ బోర్డులో అవకాశం లేదు. దీంతో కవిత తన సన్నిహితులను హెచ్సీఏలోకి పంపబోతున్నారని, ప్రస్తుత సంక్షోభం వెనుక ఆమె చేయి ఉందన్న చర్చ మళ్లీ మొదలైంది. తన కనుసైగల్లో పనిచేసే వ్యక్తి ఇప్పుడు హెచ్సీఏ బోర్డు ప్రెసిడెంట్ కాబోతున్నారని, ఆ తర్వాత బీసీసీఐలో చక్రం తిప్పాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. అయితే మాజీ ఎంపీ వివేక్ కూడా ఈసారి మరింత పట్టుదలతో బీజేపీ పెద్దల సహకారంతో తన మార్క్ చూపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కథ అంతా హెచ్సీఏలో ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది.