Thursday, November 21, 2024

డబుల్ ధ‌‌మాకా….‌‌

గురిచూసి కొట్టిన కేసీఆర్‌
ఫలించిన చాణక్యం
అభ్యర్థి ఎంపిక నుండి పోలింగ్‌ దాకా అన్నీ తానై పర్యవేక్షణ
విపక్షాలకు కోలుకోలేని షాక్
బీజేపీ ఆనందం ఆవిరి… కాంగ్రెస్‌ ఖల్లాస్‌
హైదరాబాద్‌పై తొలిసారి గులాబీ పతాక
అదే ఊపులో సాగర్‌లోనూ దుమ్మురేపుతామని ధీమా

గులాబీదళపతి కేసీఆర్‌ గురిచూసి కొట్టారు. తాను ఎన్నికపై మనసుపెడితే.. ఫలితం ఎలా ఉంటుందో మాస్టర్‌ స్ట్రోక్‌తో చూపారు. రాజకీయ చాణక్యంలో.. తనకు ఎదురులేదని మరోసారి నిరూపించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో ఆందోళనతో ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు.. సరైన సమయంలో సరైన విజయం ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో లభించింది. తమకు ఏ వర్గం వ్యతిరేకంగా ఉన్నారని.. విపక్షాలు గత రెండున్నరేళ్ళుగా ప్రచారం చేస్తున్నాయో.. ఆ వర్గాన్నే మెప్పించి విజయభేరి మోగించడం గులాబీ శ్రేణులకు కిక్కిస్తోంది…

హైదరాబాద్‌, : ఆరు ఉమ్మడి జిల్లాలు.. 77 అసెంబ్లి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో.. ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రావడంతో గులాబీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. సారు వ్యూహాలకు.. ఎదురు లేదు.. కారు జోరుకు అడ్డు లేదు అంటూ ఆనందపరవశలవు తున్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాల తర్వాత.. టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి పెంచిన బీజేపీకి.. సిట్టింగ్‌ సీటును కూడా లాగేసుకోవడం ద్వారా.. దిమ్మదిరిగే షాకిచ్చింది. తమపై ప్రజల్లో అభిమానం చెక్కుచెదరలేదని, ప్రజల నాడి.. తమకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని మరోసారి ఘనంగా చాటింది. నివ్వెరపరిచే వ్యూహాలతో.. ఆది నుండి పోలింగ్‌ ముగిసేవరకు అనుక్షణం పర్యవేక్షించిన సీఎం కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల్లో గెలుపుకు బాటలు వేశారు. సిట్టింగ్‌ స్థానం నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాన్ని గెలుచుకోవడంతో పాటు బోనస్‌గా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం కూడా బోనస్‌గా నెగ్గి డబుల్‌ ధమాకా సాధించింది. ఈ విజయం.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనుండగా, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు బూస్ట్‌లా పనిచేయనుంది.
అదిరిపోయే వ్యూహాలు
నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ నియోజకవర్గం.. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కాగా, ఇక్కడ సిట్టింగ్‌ పట్ల సహజ వ్యతిరేకత ఉండే అవకాశం ఉందని.. కొందరు ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు సహకరించక పోవొచ్చన్న ప్రచారం జరిగింది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా జనవరి 1 నుండే ప్రచారం మొదలు పెట్టి.. ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేయడంతో పాటు అసంతృప్తులకు నచ్చజెప్పుకుంటూ, కారణాలు వివరిస్తూ.. మెప్పించారు. వ్యూహాత్మకంగా ప్రచా రంలో చొచ్చుకుపోయారు. సీఎం కేసీఆర్‌ చాణక్యం, మంత్రులు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశం.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధసంఘాలు ముందుకు వచ్చి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో పల్లాకు పరిస్థితి అనుకూలంగా మారిపోయింది. పల్లా మరోసారి ఇక్కడ పోటీచేయడం సాహసంగా.. మొదట సొంతపార్టీ నేతలు భావించగా, దీనిని సవాల్‌గా స్వీకరించి పట్టుదలతో విజయం సాధించారు. ఇక హైదరాబాద్‌ నియోజక వర్గానికి ఇప్పటికి నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా.. తొలిసారి గులాబీజెండా ఎగిరింది. టీఆర్‌ఎస్‌కు అననుకూల నియోజకవర్గం.. పోటీచేస్తారా.. ఇతరులకు మద్దతునిస్తారా అంటూ ప్రచారం జరిగిన నియోజకవర్గంలో ఎన్నికల ముంగిట అనూహ్యంగా అభ్యర్థిని ప్రకటించడంతో పాటు మంత్రులను కూడా ఇన్‌ఛార్జిలుగా పెట్టి.. లక్ష్యాన్ని గురిచూసి కొట్టారు. టీఆర్‌ఎస్‌ వ్యూహం విపక్ష బీజేపీని ఖంగుతినిపించగా, హైదరాబాద్‌లో తమకు తిరుగులేదను కున్నచోట.. కేసీఆర్‌ వ్యూహాల ముందు చతికిల పడాల్సి వచ్చింది. ఇక్కడ పీవీ కుమార్తె వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించడం నుండి మంత్రి హరీష్‌ రావును రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జిగా నియమిం చడం, ప్రశాంత్‌రెడ్డిని మహబూబ్‌ నగర్‌కు, గంగుల కమలాకర్‌ను హైదరాబాద్‌ ఇన్‌ఛార్జిగా పంపి.. విలక్షణ వ్యూహం అమలుచేశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ద్వారా.. బీజేపీ వల్ల రాష్ట్రా నికి ఏం ఒరగలేదన్న అంశాలను.. జనబాహుళ్యంలోకి చొచ్చుకెళ్ళేలా చేశారు. పునర్విభజన హామీలను.. తెరపైకి తెచ్చారు. సామాజిక మాధ్యమాలను, మీడియాను విస్తృతంగా వినియోగించుకున్నారు. బహుముఖ వ్యూహాలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.
ఒకటిలోనే కాదు.. రెండులోనూ..
టీఆర్‌ఎస్‌ తొలి ప్రాధాన్యంలోనే కాదు.. రెండో ప్రాధాన్యంలోనూ ఓటు పొందడం సంచలనంగా మారింది. తొలి ప్రాధాన్యంలో అటు నల్లగొండ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డి, ఇటు హైదరాబాద్‌ నియోజక వర్గంలో వాణిదేవి 30శాతం ఓట్లు పొందగా.. 70 శాతం ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారని భావించారు. కానీ ఓటర్లు ఇవేవీ పట్టించుకున్నట్లు లేదు. ప్రభుత్వంపై అంత వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా లేదని రెండో ప్రాధాన్యత ద్వారా స్పష్టమైంది. నల్లగొండ స్థానాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యం వచ్చిన ఓట్లలో.. పట్ట భద్రులు ద్వితీయ ప్రాధాన్యాన్ని ఎక్కువగా కోదండ రామ్‌కు, తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డికి లభించాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి వేసిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు ఎక్కువగా లభించడం విశేషం. బీజేపీకి పడ్డ ఓట్లలో పల్లా రాజేశ్వరరెడ్డికి 10,282, తీన్మార్‌ మల్లన్నకు 9043, కోదండరామ్‌కు 13623 ఓట్లు ద్వితీయ ప్రాధా న్యంలో లభించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ద్వితీయ ప్రాధాన్యంలోనూ తీన్మార్‌ మల్లన్న, కోదం డరామ్‌ చీల్చగా, కాంగ్రెస్‌, బీజేపీ ఓటింగ్‌ను కూడా.. పల్లా రాజేశ్వరరెడ్డి పొందడం విశేషం. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ పక్కాగా చేసిన గ్రౌండ్‌ వర్క్‌ వల్లే ఇది సాధ్యమైందని, ఓటు ఖచ్చితంగా రాదనుకున్న చోట.. నేర్పుగా ద్వితీయ ప్రాధాన్యం సాధించడం పరిశీలకులనే విస్మయపరుస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు పడ్డ ఓట్లలో.. ద్వితీయ ప్రాధాన్యం అనూహ్యంగా సాధించడం, ద్వితీయ.. తృతీయ స్థానాల్లో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉండడంతో పల్లాకు గెలుపు సునాయాసమైంది. ఇక హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి వచ్చిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యం ఎక్కువగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి రావడం విశేషం. ఇక్కడ అభ్యర్థి క్లీన్‌ ఇమేజ్‌, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె కావడం, టీఆర్‌ఎస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును చేరడం కూడా కలిసొచ్చిందని భావిస్తున్నారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వామపక్షాల మద్దతుతో పోటీచేయగా, వామపక్ష భావజాల ఓటింగ్‌ కూడా.. ద్వితీయ ప్రాధాన్యంగా టీఆర్‌ఎస్‌ను ఎంచుకోవడం పట్టభద్రుల.. భిన్నత్వానికి అద్దం పడుతోంది. అయితే గ్రామీణ పోలింగ్‌తో చూస్తే.. పట్టభద్రులు ఎక్కువగా ఆయా రాజకీయ పార్టీల్లో క్రియాశీలంగా ఉండరని, ఉద్యోగులు.. టీచర్లు.. ఇతర పట్టభద్రులు స్వతంత్రులు కాబట్టి రాజకీయపార్టీల కంటే.. అభ్యర్థులు, నేతల నేపథ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఫలితాలపై టీఆర్‌ఎస్‌ ముందునుండీ.. ధీమాగా ఉండగా, నాలుగురోజుల కౌంటింగ్‌ తర్వాత అదే రుజువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement