గేమింగ్ కెరీర్ లో యువతకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు టీఎస్ ప్రభుత్వంతో ట్రినిటీ సమావేశమైంది. బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలో 2వ పార్టనర్స్ ఫ్యాన్ మీట్ 2022 నిర్వహించింది. గేమింగ్ కెరీర్, యువతకు అవకాశాలపై నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రముఖులు, ట్రినిటీ గేమింగ్ ఇండియా, ఫేస్ బుక్ గేమింగ్, అభిమానుల మధ్య చర్చా కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక, కాలేజియేట్, ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ… గేమింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కల్పనతో పాటు, ఆర్థిక ఉత్పత్తికి పెద్ద మూలమన్నారు. ఇలాంటి కాన్ క్లేవ్ నిర్వహించేందుకు హైదరాబాద్ ఉత్తమమైన ప్రదేశమన్నారు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు గేమింగ్ ద్వారా నేర్చుకోవడం కంటే మెరుగైన మార్గం మరొకటి లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం (ఐ అండ్ సీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ… గత రెండేళ్లలో గేమింగ్ చాలా పెరిగిందన్నారు. కొత్త గేమ్ లను రూపొందించేందుకు, పరిశ్రమను అభివృద్ది చేసేందుకు గేమింగ్ కమ్యూనిటీని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నామన్నారు. ట్రినిటీ గేమింగ్ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ… ట్రినిటీ గేమింగ్ జాతీయ స్థాయిలో గేమింగ్ పరిశ్రమ ఇంటెన్సివ్ ఎదుగుదలలో పాల్గొనేందుకు ఆసక్తిని కలిగి ఉందన్నారు. ట్రినిటీ గేమింగ్ కో ఫౌండర్ శివమ్ రావు మాట్లాడుతూ… ఈ ఈవెంట్ విజయం గేమింగ్ కమ్యూనిటీని ప్రోత్సహించే సానుకూల ఫలితానికి దారి తీస్తుందని నమ్ముతున్నామన్నారు.