Friday, November 22, 2024

ప‌గ‌టి ర‌ద్దీని ఆపాల్సిందే – స‌ర్కార్ కు హైకోర్టు ఆదేశం…

హైదరాబాద్‌, : రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు రాజకీయ సభలు, సమావేశాలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలని సూచించింది. కేవలం నైట్‌ కర్ఫ్యూ తోనే కట్టడి చేయలేమని, పగటి సమయాల్లో జనం రద్దీని నివారించడానికి చర్యలు చేపట్టాలని మంగళ వారం స్పష్టం చేసింది. ప్రతీరోజు హెల్ప్‌ లైన్‌ నెంబర్ల కు వస్తున్న కాల్స్‌ను పరిశీలిస్తే రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉండో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టుల రిపోర్టులను 24 గంటల వ్యవధి లోనే అందించాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. రాష్ట్రా నికి సరిపడా ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానిం చింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని పరి స్థితులకు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరాను పెంచా లని ఆదేశించింది. అవసరాన్ని బట్టి వాయుసేన విమానాలను ఆక్సిజన్‌ రవాణా కోసం మరింత విస్తృ తం గా వినియోగించాలని ఆదేశించింది. కరోనా చర్యలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వం సమర్పించిన నివేదిక సరిగా లేదన్న ఉన్నత న్యాయస్థానం రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల పెరుగుదలపై ఆందోళన వెలిబుచ్చింది. మినీ పురపోరు ఎన్నికలతో కరోనా పెరిగే ప్రమాదం ఉందన్న హైకోర్టు పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంది. కోవిడ్‌ కట్టడి చర్యలపై ఈనెల 29లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పదే పదే ఆదేశిస్తున్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచడం లేదన్న హైకోర్టు.. రోజూ జిల్లాల వారీగా బులెటిన్‌ ఇవ్వాలని ఆదేశించింది. హోం ఐసోలేషన్‌ వారి కోసం హితం యాప్‌ పునరుద్ధరించాలని సూచించింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరింది. కరోనా మరణాలపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని పేర్కొంది. మృత దేహాలను తరలించే వాహనాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వృద్ధులు, దివ్యాం గులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న ప్రభు త్వం.. వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల వసతి గృహాల్లోనే ఎందుకు వ్యాక్సిన్లు వేయకూడదని హైకోర్టు ప్రశ్నించింది.
నాలుగుకేసులేనా?
కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. భౌతికదూరం పాటించనందుకు నాలుగు కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కేసులు నమోదు కావడం హాస్యాస్పదమని హైకోర్టు చెప్పింది. మాస్కులు సక్రమంగా ధరించకున్నా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement