స్టేండప్ కమిడియన్ మునావర్ హైదరాబాద్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. మునావర్ ఫారూఖీ కామెడీ షో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్టాండప్ కామెడీ షో వద్దేవద్దంటూ కమలం పార్టీ హెచ్చరిస్తోంది. కానీ పోలీసులు మునావర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే మునావర్ షోకి అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. కానీ మునావర్‌ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని బీజేపీ, హిందూ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
మునావర్‌ను మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించారు.. కోవిడ్ కారణంగా మునావర్ గతంలో ఇక్కడికి రాలేదు. ఇప్పుడు వస్తుండడంతో కామెడీ షోకు పోలీసులు అనుమతినిచ్చారు. మతంతో సంబంధం లేదని.. కామెడీ షోకు అనుమతిచ్చామని పోలీసులు చెప్పారు. తాము వ్యతిరేకిస్తున్న మునావర్‌ను కేటీఆర్ ఆహ్వానించడం.. హైదరాబాద్ లో షో చేస్తుండడంపై బీజేపీ భగ్గుమంది. హిందువులను కించపరిచే వ్యక్తి కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారంటూ మంత్రి కేటీఆర్‌ను రాజాసింగ్ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ అయితే పోలీసులే బాధ్యతవహించాలని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేను ముందస్తుగా అరెస్ట్ చేసిన విషయం విధితమే.