రామచంద్రాపురం : తాళం వేసి ఉన్న ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, నగదు అపహారించుకుపోయిన సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో గల సాయి కుటీర్ అపార్ట్ మెంట్ లోని నాలుగవ అంతస్తులో నివాసముంటున్న కార్తీక్ వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. రెండు రోజుల క్రితం వాళ్ల బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడు. కార్తీక్ ఫ్లాట్ కు తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి గోడ దూకి అపార్ట్మెంట్ లోకి ప్రవేశించారు.
అక్కడి నుంచి నేరుగా నాల్గవ అంతస్తుకు చేరుకొని కార్తీక్ ఉన్న ఫ్లాట్ కిటికీ గ్రిల్ ఊడదీసి లోపలికి ప్రవేశించారు. కార్తీక్ ఇంట్లోని అన్ని గదులను జల్లెడ పట్టి అల్మారులో ఉన్న బట్టలు సామాన్లను మంచంపై చిందరవందరగా పడేశారు. అల్మారా లోని బంగారు ఆభరణాలు, నగదును దుండగులు అపహరించుకుని పోయి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు
అపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు నేరుగా నాలుగవ అంతస్తులోకి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా కనిపించాయి. సమాచారాన్ని అందుకున్న రామచంద్రపురం పోలీసులు శనివారం ఉదయం మల్లికార్జున నగర్ కాలనీలోని సాయి కుటీర్ అపార్ట్మెంట్ కు చేరుకుని పరిశీలిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ నిపుణులు వచ్చాకే ఎంత మేర బంగారం, నగదు అపహరణకు గురైన విషయాలు తేలనున్నాయి.