హైదరాబాద్, ఆంధ్రప్రభ : చలి కాలంలోనూ తగ్గేదేలే అన్నట్లుగా తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. డిసెంబరులోనూ పగటిపూట ఉష్షోగ్రతలు మండిపోతున్నాయి. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రాత్రి చలి తీవ్రత తక్కువగా ఉంటోంది. పగటిపూట ఎండల తీవ్రత పెరుగుతుండడంతోగాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా చలికాలంలోనూ ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఎండలు సుర్రు మనిపిస్తున్నాయి. తెలంగాన కశ్మీరంగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలోనూ డిసెంబరులో ఎండలు మండిపోతున్నాయంటే భానుడి ప్రతాపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. రానున్న రెండు, మూడు రోజులూ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగానేఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది.