కర్మన్ ఘాట్, (ప్రభ న్యూస్) : హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బైరామల్ గూడలో 194 కోట్లతో నిర్మించిన రెండవ లెవెల్ ఫ్లై ఓవర్ ను ఇవ్వాల (శనివారం) సాయంత్రం రేవంత్ రెడ్డి.. మంత్రులు దూదిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల్లో తనను ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు ఆదరించి 30 వేల పైచిలుకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మెజార్టీతో గెలిపించినందుకు పార్లమెంటులో ప్రశ్నించేందుకు అవకాశం కలిగిందని అన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిసిసి అధ్యక్షుడిగా ఎంపికయ్యానని తెలంగాణ నలుమూలల ప్రజలు ఆదరించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించి ముఖ్యమంత్రి కావటానికి అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో తనకు చుట్టాలు సంబంధీకులు స్నేహితులు అత్యధికులు ఉన్నారని నియోజకవర్గానికి వస్తే తనకు శరీరంలో అంత వేడి పెరిగిపోతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని, త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపట ఉన్న అన్నిటిని ఒకే గొడుగు కిందకు తెచ్చి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అర్బన్, సబర్బన్, రూరల్ గా క్లస్టర్ గా ఏర్పాటుచేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
2024 ,2050 వరకు ప్రణాళిక బద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కొద్దిసేపట్లోనే కేంద్ర ప్రభుత్వానికి ఎవరో ఫిర్యాదు చేసి అడ్డుకోవాలని చూస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో మెట్రో నిర్మాణం చేపడతామని తెలిపారు. అభివృద్ధికి సహకరించాలి తప్ప కాళ్లలో కట్టెలు వేయొద్దని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చామని అందులో భాగంగా ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా పెళ్లెందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. గత మూడు మాసాలుగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. దాని ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉన్న వారికి ఉచితంగా విద్యుత్తును అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు తెలిపారు.
నాగోల్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రో రైల్ పొడిగించడంతోపాటు, ఎల్బీనగర్ నుండి ఓవైసీ ఆసుపత్రి చంద్రాయన్ గుట్ట మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు, మియాపూర్ నుంచి బిహెచ్ఇఎల్ వరకు మెట్రోను పొడగించనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల వెడల్పుతో పాటు మెట్రో రైలు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు . చంపపేట్ డివిజన్లో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక కార్పొరేటర్ వంగ మస్తుదన్ రెడ్డి శాలువాతో సన్మానించారు.