Saturday, January 4, 2025

HYD | కరచాలనాలు, కవిత్వ పరిమళాల మధ్య ఆనందంగా ముగిసిన పుస్తక ప్రదర్శన.!

ప్రముఖ కవి యాకూబ్‌కి ప్రశంసలు
పురాణపండ పుస్తకాలకు అత్యధిక ఆదరణ.!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (ఆంధ్రప్రభ) : గత పది రోజులపాటు వేలాదిమంది పాఠక అభిమానులు, మేధావులు, అతిథులు, రచయితలు, కవులు, వక్తలు, ఖాతాదారులతో కిటకిటలాడిన 37వ జాతీయ పుస్తక ప్రదర్శన సందడిగా ముగిసింది. జస్టిస్‌ రాధారాణి ముఖ్యఅతిథిగా, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్‌, సీనియర్‌ పాత్రికేయులు కొండుభట్ల శ్రీరామచంద్రమూర్తి అతిథులుగా పాల్గొని, బుక్‌ ఫెయిర్‌ కమిటీ అధ్యక్షులు యాకూబ్‌ సమర్థవంతంగా పుస్తక ప్రదర్శనను ఎంతో జ్ఞాన విజ్ఞానదాయకంగా గొప్ప అనుభూతిని మిగిల్చేలా నిర్వాహించారని కొనియాడారు.

బుక్‌ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి ఆర్‌.వాసు, ఉపాధ్యక్షులు మలుపు బాల్‌రెడ్డి తదితరులు ఈ ముగింపు వేడుకలను పర్యవేక్షించారు. కవులు, సాహిత్య ప్రముఖులతో కలిసి ప్రముఖ రచయిత, పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్‌ పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ప్రముఖకవి, జాతీయ పుస్తక ప్రదర్శన అధ్యక్షులు యాకూబ్‌, పురాణపండ శ్రీనివాస్‌లు కవితాత్మకంగా సంభాషించుకోవడం అక్కడి వారిని ఆకర్శించింది. ప్రఖ్యాత కవి, విమర్శకులు సన్నిధానం నరసింహశర్మ కూడా వారితో జతకట్టడంతో వారు 20ఏళ్ల నాటి గ్రంథాలయ కవి సమ్మేళనాలు, సాహిత్యచర్చలు ముచ్చటించుకున్నారు. ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శనలో అధికంగా ఆకట్టుకున్న పురాణపండ శ్రీనివాస్‌ అపురూప రచనా సంకలనం అదివో.. అల్లదివో గ్రంథం గురించి పాఠకులు ప్రశంసలు కురిపించారు.

అక్షరయాన్‌ వుమెన్‌ రైటర్స్‌ వింగ్‌ ఇన్‌చార్జి ఐనంపూడి శ్రీలక్ష్మితో పాటు- పలువురు బుక్‌ స్టాల్స్‌ ప్రముఖులు శ్రీనివాస్‌తో సమావేశమవ్వడం కొత్త ప్రచురణలు, సమావేశాలకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావం అక్కడున్న వారిలో వ్యక్తమైంది. కవి ప్రముఖుడు యాకూబ్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు కావడంతో ఈ సంవత్సరం కవులు, రచయితలు, విమర్శకులు, వక్తలు, సంపాదకులకు పెద్దపీట వేశారన్న చర్చ జోరుగా సాగింది. యండమూరి వీరేంద్రనాధ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, సంగీత దర్శకుడు కీరవాణి, కే.శ్రీనివాసరెడ్డి, కే.శ్రీనివాస్‌, సుద్దాల అశోక్‌ తేజ, పురాణపండ శ్రీనివాస్‌, సతీష్‌ చందర్‌, అఫ్సర్‌, నందిని సిధారెడ్డి, ఎన్‌.వేణుగోపాల్‌, అందెశ్రీ, బీ.రాములు, మామిడి హరికృష్ణ, అరుణాంక్‌ లత, ఆవుల మంజులత, పద్మినీ ప్రియదర్శిని, శీలా సుభద్రాదేవి, మంజులా సూర్య, ఐనంపూడి లక్ష్మి, రోహిణి వంజారి, మానస ఎండ్లూరి, మెర్సీ మార్గరెట్‌, జ్యోతి వల్లబోజు, చంగల్వల కామేశ్వరి, కల్పన, విష్వఇక విశ్వ, స్వాతి శ్రీపాద తదితర ప్రముఖులెందరో ఉత్సాహవంతంగా భూమిక పోషించారు. పలువురు విద్యార్థులు, బుక్‌ స్టాల్స్‌ నిర్వాహకులు, బుక్‌ఫెయిర్‌లో కొందరు కమిటీ ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్‌తో సెల్ఫీలు దిగడం పలువురిని ఆకర్షించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement