Thursday, November 21, 2024

TG – మెరుగైన విద్యుత్ సేవ‌ల‌కు ప్ర‌త్యేక వాహ‌నాలు – ఉప మ‌ఖ్య‌మంత్రి భ‌ట్టి

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో విద్యుత్ అత్య‌వ‌స‌ర సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ కోసం సెంట్ర‌ల్ బ్రేక్ డౌన్ ప‌టిష్టం చేశామ‌ని, ఇందు కోసం విద్యుత్ అంబులెన్స్‌లను ప్రారంభించిన‌ట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు అన్నారు. సోమ‌వారం ఈ వాహ‌నాల‌ను ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.
అంబులెన్స్ త‌ర‌హా సేవ‌లు
హైదరాబాద్ మ‌హా నగరంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్ వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన‌ట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయ‌ని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు.

డివిజ‌న్ ఒక విద్యుత్ అంబులెన్స్‌
హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లు ఉన్నాయ‌ని, ప్రతి డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్త‌రిస్తున్నామ‌ని చెప్పారు. ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతార‌ని భ‌రోసా ఇచ్చారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్తో సిద్ధంగా ఉంటార‌ని తెలిపారు. ప్రతి వాహనము లో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపము మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ అవసరమైన అన్ని భద్రతా పరికరాలు ఉంటాయ‌న్నారు. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయ‌ని చెప్పారు. వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను లాగ క‌లిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయ‌ని, ఫలితంగా సిబ్బంది వాటిని తక్కువ సమయంలో తరలించడానికి మరియు మార్చడానికి అవకాశం ఏర్పడుతుంద‌న్నారు.

టీజీఎఐఎంఎస్ యాప్‌
టీజీఎఐఎంఎస్ యాప్ అత్య‌వ‌స‌ర ప్ర‌దేశాన్ని గుర్తించ‌డంలో సహాయపడుతుంద‌ని డిప్యూటీ సీఎం తెలిపారు. సిబ్బంది అవసరమైన ప్రదేశానికి వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంద‌న్నారు. వినియోగదారులకు వేగంగా, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయ‌ని, ఈ వాహనాలు దిగ్విజయంగా సేవలు అందించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను అన్నారు. కార్యక్రమం లో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీ లు ముషారఫ్ అలీ , వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement