హైదరాబాద్, ఆంధ్రప్రభ : సిబ్బంది చేతివాటం, ప్రతి వైద్య సేవకు లెక్క కట్టి లంచం వసూలు చేస్తుండడంతో పేదోడికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన గాంధీ ఆసుపత్రి అవినీతి అపప్రదను మూటగట్టుకుంటోంది. కరోనా విపత్కర కాలంలోనూ మెరుగైన సేవలందించిన గాంధీ ఆసుపత్రి… ఇప్పుడు అవినీతి, సిబ్బంది చేతివాటానికి నిలయంగా మారిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు/కార్పోరేట్‌లో లక్షలకు లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేని పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను, అందులోనూ గాంధీ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆసుపత్రికి వచ్చే రోగులు పేదలని తెలిసినా గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ప్రతి టెస్టుకు, వైద్య సేవకు రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తుండడం గమనార్హం. డబ్బులు ఇస్తేనే వైద్యం అందిస్తామని గాంధీ సిబ్బంది తెగేసి చెబుతుండడం గమనార్హం. సీనియర్ వైద్యుల దిశానిర్దేశం మేరకే సిబ్బంది అవినీతిని వ్యవస్థీకృత విధానంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు గాంధీకి వచ్చిన రోగులు వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది చేతివాటంలో సీనియర్ వైద్యులకు వాటా అందుతోందని తెలుస్తోంది. ఆసుపత్రిలో జాయిన్ చేసుకోవాలంటే వైద్యులకు కొంత మొత్తం చెల్లించాల్సిందే. ఆ తర్వాత ప్రతీ టెస్టుకు మరికొంత సమర్పించుకోవాల్సిన పరిస్థితులు గాంధీ ఆసుపత్రిలో నెలకొన్నాయి. ఇటీవలే గాంధీ ఆసుపత్రిలో సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ఇన్ ఫెర్టిలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ విభాగంలో ఈ సినియర్ మహిళా వైద్యురాలి కనుసన్నల్లో రోగుల నుంచి వసూళ్ల కార్యక్రమం విచ్చల విడిగా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐవీఎఫ్ చికిత్స కోసం అడ్మిట్ చేసుకోవాలంటే కొంత మొత్తాన్ని సిబ్బంది ద్వారా ఆ వైద్యురాలికి ముట్టజెప్పాల్సిందేనని రోగులు వాపోతున్నారు.
వైద్యం కోసం ఇటీవల ఇన్‌ఫెర్టిలిటీ విభాగంలో చేరిన దంపతులు… గాంధీ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల అవినీతిపై ఏకంగా ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజారావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… నగరంలోని రాంనగర్‌లో నివాసముం డే జానకి, శేఖర్‌గౌడ్ దంపతులు వైద్యం కోసం గాంధీ ఫెర్టిలిటీ సెంటర్‌కు వచ్చారు. గర్భసంచిలో వాపు ఉండడంతో గైనిక్ ఓపీకి రాగా… అడ్మిట్ చేసుకుని వైద్యం అందించారు. ఆ తర్వాత డిశ్చార్జి చేస్తూ… తాము మళ్లిd ఫోన్ చేసినపుడు రూ.10వేలు తీసుకుని రావాలని చెప్పారని ఆ తర్వాత, జులై 16న ఆసుపత్రికి రమ్మని ఫోన్ చేశారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత చికిత్స అందించాలంటే డబ్బులు చెల్లించాలని, డా. జానకీ మేడం అడుగుతున్నారని సిబ్బంది జులై 18న డిమాండ్ చేశారని ఫిర్యాదులో వివరించారు. ఫోెన్ నంబరు 9502204748 నుంచి ఫోన్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. మిగతా పేషెంట్లు అంతా కూడా రూ.10వేలు చెల్లించారని, మీరు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని సూపరిండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. తాము నిరుపేదలమని, అంత డబ్బు తేలేమని, న్యాయం చేసి వైద్యం అందించాలని ఆ దంపతులు సూపరిండెంట్‌ను వేడుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.