Tuesday, November 26, 2024

టెన్త్ విద్యార్ధుల‌లో ప‌రీక్ష‌ల టెన్ష‌న్..

దగ్గరపడుతున్న పరీక్షలు..
పూర్తికాని సిలబస్‌
గణితం, జీవ, భౌతికశాస్త్రాలపై
విద్యార్థుల్లో ఆందోళన
ఆన్‌లైన్‌ క్లాసులు అర్థంకాక
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

హైదరాబాద్‌, టెన్త్‌ విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. ఒకవైపు పరీక్షల టెన్షన్‌.. మరోవైపు కరోనా భయం వారికి వెంటాడు తోంది. ఎగ్జామ్స్‌ దగ్గరపడుతున్నా సిలబస్‌ ఇంకా పూర్తి కాకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రశ్నాపత్రం ఎలా ఉండబోతోంది, పరీక్షల అనంతరం ఫలితాలు ఎలా ఉంటాయి? అనే టెన్షన్‌ వాతావరణం పట్టుకుంది. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. అయినా కరోనా ఉధృతి రాష్ట్రంలో ఒకవేళ పెరిగితే అప్పుడు పరీక్షలు నిర్వహిస్తరా? లేదా? అనే అనుమానాలను కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో ప్రారంభం కావాల్సిన ఈ అకడమిక్‌ ఇయర్‌ కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబర్‌ ఒకటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించినప్పటికినీ తరగతి గది ప్రత్యక్ష బోధన మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మాత్రమే ప్రారంభమైంది. సరిగ్గా 52 రోజులు క్లాసులు నడిచాయో లేదో అప్పుడే.. మళ్లి కరోనా రాష్ట్రంలో విజృంభించడం మొదలుపెట్టింది. దీనికితోడూ ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో అన్ని విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వెరసి విద్యార్థుల చదువులు మళ్లి ఆన్‌లైన్‌ పాఠాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే దాదాపు మొత్తం సిలబస్‌ పూర్తయి పునశ్చరణ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా బ్రేకులు పడుతూ విద్యార్థుల చదువులు సాగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆ సబ్జెక్టులపైనే ఆందోళన
మే 17 నుంచి 26వ తేదీ వరకు టెన్త్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నారు. విద్యార్థుల చదువు బ్రేక్‌ పడుతూ కొనసాగుతుండడంతో సబ్జెక్టులపై పట్టు సాధించలేకపో తున్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు గతేడాది సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌ బోధనను టీశాట్‌, దూరదర్శన్‌, మొబైల్‌ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో కొన్ని రోజులు విన్నా ఆ తరువాత ఆన్‌లైన్‌ క్లాసులపౖౖె అంతగా ఆసక్తి చూపించలేదు. కొందరు విద్యార్థులు క్లాసులు వినకుండా తల్లిదండ్రులతో పనులకు పోయారు. మరికొంత మంది విన్నా వాటిని అర్థం చేసుకోలేక, సందేహాలను అడిగితే చెప్పేవారు లేక ఇబ్బందులు పడ్డారు. మళ్లి కరోనా నేపథ్యంలో స్కూళ్లు మూతపడడంతో ఇదే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమౌ తోంది. గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, ఇంగ్లీషు సబ్జెక్టులు ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా చెవికెక్కడం గగనమవుతోంది.
గత ఆన్‌లైన్‌ సిలబస్‌తోపాటు ప్రస్తుత సిలబస్‌ను అర్థం చేసుకొని సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం విద్యార్థులకు లేకుండా పోయింది. దీంతో ఎలా చదవాలి? ఏం చదవాలి? ఏ టాఫిక్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి? పరీక్షలు ఎలా రాయాలనే ఆందోళనలో ఉన్నారు. విద్యార్థులపై పర్యవేక్షణకు స్కూళ్ల వారిగా వాట్సప్‌ గ్రూపులు విద్యాశాఖ ఏర్పాటు చేసినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదని తెలుస్తోంది. గతంలో మాదిరిగా హిందీకి ఒక పేపర్‌ పెట్టి మిగతా సబ్జెక్టులకు రెండేసి పేపర్లు కాకుండా ఆరు పేపర్లు ఉండడం విద్యార్థులకు కాస్త కలిసి వచ్చే అంశం. అదీకాకుండా 20 మార్కులు ఇంటర్నల్స్‌కు, 80 మార్కులు పరీక్షకు కేటాయించారు. గతంలో ప్రశ్నపత్రంలో తక్కువ ఛాయిస్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఛాయిస్‌ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వనున్నారు. ఇది కాస్త ఊరటకల్గించే అంశమే.
నో రివిజన్‌.. డైరెక్ట్‌ ఎగ్జామేనా?
గతంలో ప్రతి ఏటా జనవరి చివరికల్లా సిలబస్‌ పూర్తి చేసి, పిబ్రవరిలో రివిజన్‌ చేసి, ప్రత్యేక తరగతులు, టెస్టులు, ప్రీఫైనల్‌ పరీక్షలు కూడా నిర్వహించేవారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం సిలబస్‌ 50 శాతం కూడా మించలేదని సమాచారం. సరిగ్గా చూసుకుంటే ఇంకా పరీక్షలకు నెలన్నర సమయం మాత్రమే ఉంది. ఆన్‌లైన్‌ క్లాసులు యథావిధిగా నిర్వహించి మిగతా సిలబస్‌ను పూర్తి చేసినా.. అవి ఎంత వరకు విద్యార్థులకు అర్థమవుతాయనేది పెద్ద ప్రశ్నే. ప్రస్తుతం ఉన్న సమయంలో మిగతా సిలబస్‌ను పూర్తి చేసి వీలైనంత వరకు రివిజన్‌ చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా ఈసారి పదవ తరగతి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement