ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అదే రోజు నుండి ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఈరోజు ఎన్.ఎస్.యూ.ఐ ఆందోళనకు దిగింది. దీంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ లో NSUI కార్యకర్తలు సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత ఎన్‌ఎస్‌యూఐ నేతలు TSPSC కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయల్దేరారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు గాంధీ భవన్ గేట్లు మూసివేసి ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గాంధీ భవన్ గేటు దూకి టీఎస్‌పీఎస్‌సి కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట్ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital