భద్రాచలం: భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవమిరోజు జగదాభిరాముని కల్యాణం కన్నుల పండువుగా నిర్వహించగా..గురువారం దశమిరోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.. ప్రభుత్వం తరుపున గవర్నర్ రాధాకృష్ణన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని వేలాది మంది భక్తులు కనులారా వీక్షించారు.
అరణ్యవాసం అనంతరం..
శ్రీరాముడు అరణ్యవాసం నుంచి తిరిగిరాగానే, కైకేయి పుత్రుడైన భరతుడు, రాముడిని సమీపించి తండ్రిమాట నిలబెట్టడంకోసం తృణప్రాయంగా రాజ్యాన్ని విడిచి, నాకు అప్పగించి ఎలా వెళ్లావో.. అలా ఆ రాజ్యాన్ని మళ్లీ నీ పాదాల చెంత పెట్టేస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు శ్రీరాముడు సంతోషించి, తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తాడు. శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం పూర్తయి అయోధ్యా నగరానికి వచ్చిన తర్వాత తండ్రి దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. చైత్రశుద్ధ దశమి, పుష్యమి నక్షత్రంలో శ్రీరామునికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిపించాడు. దీనికనుగుణంగానే శ్రీసీతారాముల కల్యాణం అనంతరం భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది..
ఇక పట్టాభిషేకం రోజైన నేటి ఉదయం నుంచి భద్రాద్రి మాడవీధులన్నీ సందడిగా మారాయి. కల్యాణమూర్తులు శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే.. ఆ ప్రాంతమంతా శ్రీరామనామ స్మరణతో మార్మోగింది. అనంతరం వైదిక పెద్దలు శ్రీరామరాజ్యంలో ప్రజాశ్రేయస్సు ఎలా వర్ధిల్లిందో వివరించారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించిన రాములవారిని చూసి భక్తజనం మురిసిపోయింది.
రాములోరి సేవలో తరలించడం నా అదృష్టం: గవర్నర్
సీతారామచంద్రస్వామి వారి మహా పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో రమాదేవి ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఆ తర్వాత గవర్నర్ మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. శ్రీ సీతారాముల సేవలో తరించడం తన అదృష్టమన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడం, సుఖసంతోషాలతో ఉండేలా చూడటమే రామరాజ్య స్థాపన ఉద్దేశమని చెప్పారు.