35-40 మెగావాట్ల సామర్థ్యం నుండి
5 వేల మెగావాట్ల ఉత్పత్తి స్థాయికి
ఆరున్నరేళ్ళలో అనూహ్య పురోగమనం
భవిష్యత్తు.. పునరుత్పాదక విద్యుత్ రంగానిదే
గణనీయంగా తగ్గిపోనున్న విద్యుత్ బిల్లులు
ఐఐటీ మద్రాస్ తాజా అధ్యయనం వెల్లడి
హైదరాబాద్, : పునరుత్పాదక విద్యుత్ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. తెలంగాణ ఆవిర్భవించిన సమయం 2014లో తెలంగాణ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. ఇందులో పునరుత్పాదక విద్యుత్ 35నుండి 40 మెగావాట్లే. ఇపుడు 4,357 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఎక్కడి 40 మెగావాట్లు.. ఎక్కడి 4,357 మెగావాట్లు. ఆరున్నరేళ్ళలో అనూహ్య పురోగమనం. తాజాగా అత్యధిక వేగంగా పునరుత్పాదక సామర్థ్యం పెంచుకున్న, ప్రోత్సహించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. 2022 నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించగా, అంతకు ముందే తెలంగాణ లక్ష్యాన్ని సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా 175 గిగావాట్ల విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) ఉత్పత్తి జరగాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించింది. రాష్ట్రంలో ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. అందులో తాజాగా 3,800 మెగావాట్లను చేరుకోగా.. మరో 1,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఇతర పునరుత్పాదక విద్యుత్‌ను కూడా తెలంగాణ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర విద్యుత్ 3800 మెగావాట్లు, మునిసిపల్ వేస్టు, వాయు విద్యుత్ ద్వారా 380.36 మెగావాట్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతుండగా, రానున్న రోజుల్లో.. రెన్యువబుల్ ఎనర్జీకి మరింత డిమాండ్ పెరగనుంది.
గ్రీన్ ఎనర్జీదే ఫ్యూచర్.. రేటూ తక్కువే
రానున్న రోజులు గ్రీన్ ఎనర్జీదేనని, ఫ్యూచర్లో పునరుత్పాదక సంస్థల నుండి చౌకరేటుకే విద్యుత్ కొనుగోలు చేసుకునే అవకాశం గృహ యాజమానులకు లభిస్తుందని ఐఐటీ మద్రాస్ బృందం తాజా అధ్యయనంలో పేర్కొంది. ప్రస్తుతం సోలార్ లేదా విండ్ పవర్ ఒక కిలోవాట్ హవర్‌కు రూ.2.5 ఖర్చవుతుండగా, నిల్వ సామర్థ్యంతో కలిపి 4.5 రూపాయలు అవుతోంది. భవిష్యత్తులో ఉత్పత్తి వ్యయం కూడా గణనీయంగా పడిపోతుందని మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్లు అధ్యయనంలో తేల్చారు. ప్రస్తుతం రూ.75 లక్షల వ్యయమయ్యే విద్యుత్‌కు కేవలం రూ.30 లక్షల ఖర్చులోనే తీయవచ్చని, ప్రస్తుతం దేశంలో 40 వేల కమర్షియల్ కాంప్లెక్స్‌లు రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పాదకులతో ఒప్పందాలను చేసుకుని.. థర్మల్ విద్యుత్ కంటే చాలా తక్కువ ధరకే విద్యుత్‌ను పొందుతున్నాయని చెప్పారు. రానున్న 20, 25 ఏండ్లలో అంతటా రెన్యువబుల్ ఎనర్జీ వినియోగమే ఉంటుందని, థర్మల్ విద్యుత్ కూడా చవకగా మారుతుందని చెప్పారు. తెలంగాణ విస్తరణ ప్రణాళికలు కూడా ఈ రంగంలో భారీగా ఉన్నాయి.
పవర్.. ఫుల్ స్టేట్
లోటు విద్యుత్ నుండి సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. 2020 మార్చి 31 వరకు టీఎస్ జెన్కోతో పాటు ప్రైవేట్ సంస్థలు కలిసి మొత్తం 15,980.40 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. అందులో థర్మల్ (బొగ్గు ఆధారిత) పవర్ ప్రాజెక్టుల నుంచి 2,962.50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. జల విద్యుత్ 2,430.60 మెగావాట్లు, మిని జల విద్యుత్ ప్లాంట్ల నుంచి 11.16, సౌర విద్యుత్ ఒక మెగావాట్గా ఉత్పత్తి చేస్తున్న టీఎస్ జెన్కో మొత్తం 5405.26 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా అంతర్రాష్ట్ర జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 76.31 మెగావాట్లు, సంయుక్త రంగమైన గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి 24.51 మెగావాట్లు ఉత్పత్తి చేసింది. ప్రయివేట్ రంగంలో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల ద్వారా 807.31 మెగావాట్ల విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర విద్యుత్ 3680 మెగావాట్లు, మునిసిపల్ వేస్టు, వాయు విద్యుత్ 380.36 మెగావాట్లు, సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా 1200 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల రూపంలో మొత్తం ప్రయివేట్ రంగంలో 7,067 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు లభిస్తోంది. మరో 2567.20 మెగావాట్ల విద్యుత్ కేంద్ర వాటాగా దక్కుతోంది. దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్‌లో భాగంగా సేయిల్ నుంచి 839 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తోంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మరింత మిగులు విద్యుత్‌గా కావడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి వస్తుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.