Friday, November 22, 2024

అంకురాల‌కు ఊతం….

హైదరాబాద్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ)లో అంకుర కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా సరికొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌), టీ–హబ్‌, వీ-హబ్‌, టీ-వర్క్స, తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌(టీఎస్‌ఐసీ), టీ-ఫండ్‌, టీ-ఎలక్ట్రానిక్స్‌, రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(రిచ్‌) తదితర సంస్థలు ముఖ్యమైనవి. వీటి ద్వారా ఐటీ శాఖ అంకుర సంస్థలకు పెట్టుబడి సమకూర్చడం నుంచి మొదలుకుని ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం, కొత్త ఆవిష్కరణలకు మార్కెట్‌లోకి తీసుకెళ్లే దాకా కంపెనీలకు వెన్నుదన్నుగా నిలవడం వంటి చర్యలు చేపడుతోంది. అయితే ఈ సంస్థలన్నింటిని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి క్రియాశీలకం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థలన్నింటికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ నిధులు పెంచిన ఫలితంగా ఈ బడ్జెట్‌లో మొత్తం ఐటీ శాఖకు ప్రగతి పద్దు కింద చేసే కేటాయింపులు భారీగా పెరిగాయి. గతంలో ఐటీ ప్రగతి పద్దుకు రూ.25 కోట్లు కేటాయించగా ఈ ఏడాది అది ఏకంగా రూ.356 కోట్లకు చేరింది.
ఈ తరహాలో అంకురాలు, ప్రారంభ దశలో ఉన్న ఇతర టెక్నాలజీ కంపెనీలకు ఉపయోగపడేందుకు ప్రభుత్వం ప్రారంభించి నిర్వహిస్తున్న సంస్థలన్నిం టికీ 2021-22 బడ్జెట్‌లో గతేడాదితో పోలిస్తే నిధులను గణనీయంగా పెంచారు. ఇప్పటికే ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ఆవిర్భావం, విజయవంతంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్‌ను మరింత వేగంగా స్టార్టప్‌లకు కేరాఫ్‌గా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ బడ్జెట్‌కు, అందులోనూ అంకురాలు, ఆవిష్క రణలకు సంబంధించిన సంస్థలకు గతేడాదితో పోలిస్తే నిధులు రెట్టింపు కంటే ఎక్కువ కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌), రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(రిచ్‌), వీ-హబ్‌, టీ-హబ్‌ లాంటి సంస్థలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. రిచ్‌ తరహా సంస్థను ఇటీవల కేంద్రం తన బడ్జెట్‌లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కేటాయించింది. ఇందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిచ్‌ స్ఫూర్తి అని అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు, అంకురాలకు ప్రోత్సాహంతోనే ఐటీ పరిశ్రమ భవిష్యత్‌ వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement