Friday, November 22, 2024

షెడ్యూల్ ప్ర‌కార‌మే పుర‌పాల‌క ఎన్నిక‌లు – తేల్చేసిన ఎన్నిక‌ల సంఘం..

హైద‌రాబాద్ : ముందు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కార‌మే రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థసార‌థి స్ప‌ష్టం చేశారు. కొవిడ్ నిబంధ‌న‌లు క‌ట్టుదిట్టంగా అమ‌లు చేస్తామ‌ని, అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం ఎస్ఈసీకి హామీ ఇవ్వ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యంలో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడూత‌, ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగించాల‌ని.. రాష్ర్ట ప్ర‌భుత్వం కోరింద‌ని తెలిపారు. అధికారుల‌తో చ‌ర్చించి ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగింపున‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. పోటీ చేస్తున్న పార్టీలు, అభ్య‌ర్ధులు కొవిడ్ నిబంధ‌న‌లు విధిగా పాటించాల‌ని పేర్కొన్నారు. రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీల‌పై నిషేధం విధించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. పోలింగ్‌కు 72 గంట‌ల ముందే ప్ర‌చారం ఆపాల‌ని ఆదేశించారు. కాగా, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌తో పాటు జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, అచ్చంపేట‌, న‌కిరేక‌ల్‌, సిద్దిపేట మున్సిపాలిటీల‌కు 30వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి అదే రోజూ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement