డబ్బుల కోసం ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 7 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని చిలకలగూడ పోలీసులు కోర్టును కోరారు. శనివారం మల్లన్నను సికింద్రాబాద్ సివిల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. తీన్మార్ మల్లన్న తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తయ్యాయి. అనంతరం మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. దీంతో ఆయనను చంచల్ గూడ జైల్‌కి తరలించారు.
కాగా, ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలపై చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిలకలగూడకు చెందిన సన్నిధానం లక్ష్శీకాంతశర్మ మారుతీ సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్‌లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి పేరు చెడగొడతానని బెదిరించాడని లక్ష్మీకాంత్‌శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి ఈ నెల 3న చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు రావాలని మల్లన్నను కోరారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని న్యాయవాది ద్వారా సమాచారం పంపిన మల్లన్న విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. కాగా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని, అరెస్టు చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మల్లన్న ప్రకటించారు.
ఇది కూడా చదవండిః ఆఫ్ఘన్ లో దారుణ పరిస్థితి.. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని..