విజయవాడ : భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ పరిశ్రమకు అనుకూలీకరించిన అదనపు బల ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడానికి టాటా స్టీల్ తమ మూడవ పూర్తి ఆటోమేటెడ్ నిర్మాణ సేవా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ అనుపమ్, ఇతర సీనియర్ కంపెనీ అధికారులతో పాటు ఛానెల్ పార్టనర్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.
ఈసందర్భంగా టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ అనుపమ్ మాట్లాడుతూ… డౌన్‌స్ట్రీమ్ బిజినెస్ లో పెరుగుతున్న తమ కార్యకలాపాలు భారతదేశ నిర్మాణ రంగాన్ని తీర్చిదిద్దడంలో తమ నిబద్ధతకు ప్రతిబింబమన్నారు. ప్రస్తుతం టాటా స్టీల్ నిర్మాణ రంగానికి సిద్ధంగా ఉపయోగించగల ఉక్కు ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడానికి అవసరమైన సామర్థ్యాలతో తగిన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని సేవా కేంద్రాల ద్వారా తమ వినూత్న ఆఫర్లను మరింత విస్తరించాలని తాము భావిస్తున్నామన్నారు.
ఈ కంపెనీ హైదరాబాద్‌లో ‘కన్వర్స్ టు కన్‌స్ట్రక్ట్’ పేరుతో ఏఈసీ (ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, అండ్ కన్‌స్ట్రక్షన్) కమ్యూనిటీ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ సమావేశానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, ఇండస్ట్రియల్ రంగాలకు చెందిన వంద మందికి పైగా కస్టమర్‌లు, కన్సల్టెంట్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఏ ఆర్కిటెక్ట్స్ సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ చార్లెస్ అర్నాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఐసీఎంఏఆర్, ప్రశాంత్ కుమార్ శ్రీరామ్ వంటి ప్రముఖ పరిశ్రమ స్పీకర్లు కూడా పాల్గొన్నారు.