Friday, November 22, 2024

HYD: నకిలీ పేమెంట్ స్క్రీన్‌షాట్లతో తస్మాత్ జాగ్రత్త… ఫోన్ పే

హైదరాబాద్, మార్చి 13 (ప్ర‌భ న్యూస్) : నకిలీ స్క్రీన్‌షాట్ మోసాలు వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఫుడ్ స్ట్రీట్‌లో బిజీగా ఉండే మర్చంట్ లేదా పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చే ప్రముఖ బహిరంగ మార్కెట్లలో ఉన్న వ్యాపారులు ఈ నకిలీ స్క్రీన్‌షాట్లతో పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. అటువంటి సందర్భాలలో పేమెంట్ అయిందని నిర్ధారించడం చాలా కష్టమవుతుంది. అమాయకులను బలిపశువులను చేయడానికి ప్లాన్ గీసే మోసగాళ్లకు ఇది సరైన అవకాశంగా మారుతోంది. ఒక మోసగాడు పేమెంట్ ప్రాసెస్ అయిందని, అలానే బాధిత మర్చంట్ అకౌంట్‌లో నగదు మొత్తం జమ అయిందని చూపేందుకు పేమెంట్ నిర్ధారణ నకిలీ స్క్రీన్‌షాట్‌ను సృష్టించడాన్నే నకిలీ స్క్రీన్‌షాట్ మోసం అంటారు.

దీన్ని ఎదుర్కోవడానికి అవగాహన పెంచుకోవడమే మన ముందున్న మార్గం, అలానే బాధితులుగా మారకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి. ఆఫ్‌లైన్ మర్చంట్లను తప్పుదారి పట్టించడం వంటివి చేస్తుంటారు. అలాగే ఆన్‌లైన్ వ్యాపార సంస్థలను మోసం చేయడం, ఆన్‌లైన్‌లో డబ్బు పంపించి, నగదు ఇవ్వమని కోరడం, పొరపాటున డబ్బును పంపించామని అబద్ధం చెప్పడం చేస్తుంటారు.


ఆఫ్‌లైన్ మర్చంట్లను తప్పుదారి పట్టించడం… మర్చంట్ బిజీగా ఉండటం లేదా తరచుగా పరధ్యానంలో ఉండటం వల్ల పేమెంట్ నిర్ధారణను చెక్ చేయడానికి వారికి తగిన సమయం దొరకకపోవచ్చు. ఈ ప్రతికూల పరిస్థితిని మోసగాళ్లు ఉపయోగించుకుని మర్చంట్ నుండి ఉత్పత్తులు లేదా సేవలను పొందినప్పుడు నకిలీ స్క్రీన్‌షాట్‌ను చూపిస్తారు. కొన్ని ఇతర సందర్భాల్లో, అంటే ఇన్‌స్టాగ్రాం వేదికగా బిజినెస్ చేసే మర్చెంట్లు ప్రతి ఆర్డర్‌నూ కస్టమర్ బేస్‌ను క్రియేట్ చేసే అవకాశంగా చూస్తారు, అలానే మంచి కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలనుకుంటారు.

- Advertisement -

ఈ క్రమంలో కస్టమర్ పేమెంట్ చేశానని చెబుతూ స్క్రీన్‌షాట్‌ను పంపించేటప్పుడు, తమకు పేమెంట్ నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ ఆ నకిలీ స్క్రీన్‌షాట్‌ను నమ్మవలసి వస్తుంది. పేమెంట్ ఎలానూ తర్వాత వచ్చేస్తుందనే నమ్మకంతో ఉత్పత్తి లేదా సేవను అందిస్తారు. అయితే తాము మోసగాళ్ల చేతిలో మోసపోయామని బాధిత మర్చెంట్‌కు చాలా కాలం తర్వాత తెలుస్తుంది. మోసగాళ్లు బాధితుడికి పొరపాటున డబ్బు పంపామని అబద్ధం చెబుతూ వాట్సప్‌లో నకిలీ స్క్రీన్‌షాట్ పంపుతారు, అక్కడితో ఆగకుండా పదేపదే కాల్ చేస్తూ ఆ డబ్బు తిరిగి పంపించమని అడుగుతారు. ఒకవేళ పంపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి, బాధితుడు డబ్బును పంపించేలా ఒత్తిడి తీసుకొస్తారు. మీరు నకిలీ స్క్రీన్‌షాట్ స్కామ్‌కు గురైనట్లయితే.. ఒకవేళ మీరు ఫోన్ పేలో మోసగాడి చేతిలో స్కామ్‌కు గురైనట్లయితే, వెంటనే ఫోన్ పే యాప్‌లో లేదా కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి లేదా ఫోన్ పే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆ స్కామ్‌ గురించి తెలపవచ్చు. చివరగా, మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ సెల్‌లో ఆ మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌తో మాట్లాడి ఫిర్యాదు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement