Monday, November 18, 2024

HYD: స్వామి వివేకానందుడు గొప్ప తాత్వికుడు… ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా

హైదరాబాద్‌ : స్వామి వివేకానందుడు గొప్ప తాత్వికుడు అని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ పూర్వ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు. స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా చిక్కడపల్లి త్యాగరాయ గ్రామసభలో శుక్రవారం స్వామి వివేకానందుని జీవిత చరిత్రపై కవి సమ్మేళనం వేదహిత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఆచార్య డాక్టర్‌ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ తో కలిసి ముఖ్యఅతిథిగా ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా పాల్గొన్నారు. ఈ కవి సమ్మేళనంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుండి దాదాపు 25మంది కవులను ఘనంగా సన్మానించారు.

ఈసందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ… అద్వైత వేదాంతం తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుందని వివేకానందుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రంగా మారిందన్నారు. స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారన్నారు. దాంట్లో ముఖ్యమైనది మందలో ఉండకు వందలో ఉండడానికి ప్రయత్నించు.. ప్రయత్నం చేసి ఓడిపో.. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని వివేకానంద ఎంతోమంది యువకులకు ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. నేటి యువత వివేకానందుని ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సేవ చేయడానికి ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో మురళీ మనోహర్‌ రాజు, రామచంద్ర రావు, మౌనిక సుంకర అడ్వకేట్‌, శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement