Tuesday, July 2, 2024

TG | జల సంరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యం : డాక్టర్ సతీష్ రెడ్డి

జల సంరక్షణకు, భూగర్భ జలాల పెంపుదలకు, వాన నీటి సద్వినియోగానికి ప్రజలందరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నీటి సంరక్షణను ఒక ఉద్యమంగా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని డీఆర్ డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు. వాన నీటి సంరక్షణ చేయకపోతే మానవాళి మనగడ ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.

జులై 1వ తేదీన వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ దుర్గం చెరువు పార్కులో ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్, సింగరేణి సంస్థల ఆధ్వర్యంలో జల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు 5 కిలోమీటర్ల నడక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డి నిర్వహణలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు. నీటిని కాపాడుకోవడాన్ని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఖాదీ బోర్డు సభ్యులు పేరాల శేఖర్ రావు మాట్లాడుతూ.. జల కాలుష్యాన్ని నివారించాలని, నదులు లేకపోతే నాగరికత ఉండదన్నారు. ప్రజలు ఇతర సమస్యల కన్నా పర్యావరణ సమస్యలను అత్యంత ప్రాధాన్యత గల అంశాలుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. జల సంరక్షణతోపాటు మొక్కలు నాటడానికి ప్రతీ ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం పర్యావరణ సమతూల్యత దెబ్బతినడం వల్ల అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తాగునీటికి కూడా యుద్ధాలు చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

- Advertisement -

కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం కోసం వైద్యుల అవసరం ఉంటుందని.. కానీ ప్రపంచం మనుగడకు ప్రకృతిని కాపాడుకోవడం ద్వారానే సాధ్యమని.. ఇందుకోసం నీటి సంరక్షణ అత్యంత అవసరమన్నారు.ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు. అనంతరం 200 మందికి పైగా వైద్యులు ఉత్సాహంగా 5 కిలోమీటర్లు నడిచారు. ఈ 5కే వాక్లో పాల్గొన్న వారిని డాక్టర్ సతీష్ రెడ్డి, నిర్వాహకులు మెడల్స్తో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement