Tuesday, November 26, 2024

TG | హిమోఫిలియా బాధితులు సాధారణ జీవితాన్ని గడపవచ్చు

హీమోఫిలీయా బాధితులు అందరి మాదిరిగానే సాధారణ జీవితం గడుపవచ్చునని ప్రముఖ హీమటాలజీ వైద్యనిపుణులు వెల్లడించారు. గతంలో కంటే ఇప్పుడు హీమోఫిలీయా బాధితుల జీవిత కాలం సగటు మానవ జీవిత కాలానికి చేరిందని వైద్యులు వివరించారు.

రాయల్ డీసిజ్‌గా పేర్కొనే హీమోఫిలీయా రక్త సంబంధిత వ్యాధుల్లో ఒకటని నిమ్స్‌ హీమటాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ రాధిక అన్నారు. హైదరాబాద్‌ హీమోఫిలీయా సోసైటీ అధ్యర్యంలో గత రెండేళ్లుగా రిజిస్టరైన వ్యాధిగ్రస్తులకు లక్డికాపూల్‌లోని అడోబ్‌ హోటల్‌లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ రాధికతోపాటు లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ హీమటాలజీ వైద్యురాలు డాక్టర్ శ్రావ్య, ప్రముఖ ఫిజియోథెరిపి వైద్య నిపుణురాలు డాక్టర్ పమేలా నారాయణ్ పాల్గొన్నారు. వైద్య రంగంలో శాస్త్ర సాంకేతికపరంగా వస్తున్న చికిత్సలో భాగంగా హీమోఫిలీయా కు అత్యంత మెరుగైన ఫ్యాక్టర్ ఇంజక్షన్‌ మందులు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ రాధిక వివరించారు.

హీమోఫిలియా బాధిత కుటుంబ సభ్యులు అవగాహన పెంచుకుని తర్వాతి తరానికి వ్యాధి సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శ్రావ్య సూచించారు. వ్యాధిగ్రస్తుల తల్లులు ముందు జాగ్రత్తలు పాటించినట్లయితే హీమోఫిలియా సమాజంలో లేకుండా చేయవచ్చునని వివరించారు.

హీమోఫిలియా బాధితులకు అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు ఫ్యాక్టర్ ఇంజిక్షన్‌తోపాటుగా ఫిజియోథెరిపి వైద్యులను సంప్రదించి ఉపశమనం పొందాలని డాక్టర్ పమేలా నారాయణ్ తెలిపారు. కీళ్లు, కండరాల్లో రక్తస్రావం జరిపినప్పుడు ఫిజియోథెరిపి చాలా ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ హీమోఫిలియా సోసైటీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రావు,సుభాష్‌ చంద్ర, ఉపాధ్యక్షులు అబ్దుల్ రజాక్, జాయింట్ సెక్రటరీ వంశీకృష్ణ, మహిళా ప్రతినిధులు దీపికా, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement