సింగరేణి సంస్థ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిందని, దీనిని కొనసాగిస్తూ రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు రానున్న ఐదేళ్ల లో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించుకోనున్నామని తద్వారా 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించనున్నామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమర యోధులకు ఘన నివాళులు అర్పిస్తూ సింగరేణి సంస్థ స్వాతంత్య్ర భారతావనికి చేసిన సేవలను ప్రస్తుతించారు. సింగరేణి సంస్థ దక్షిణ భారత దేశంలోని విద్యుత్ సంస్థలకు తగినంత బొగ్గును అందించి ఈ ప్రాంత ప్రగతికి తోడ్పడిందని, అలాగే 2000 పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేయడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వామి అయిందన్నారు. ఇదే ఒరవడిలో సింగరేణి సంస్థ బొగ్గుతో పాటు థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగాల్లోకి కూడా అడుగు పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడుతోందన్నారు. ఇప్పటికే 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ నిర్మించి అత్యుత్తమ పీఎల్ఎఫ్ తో దేశంలోని ఉత్తమ థర్మల్ కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఈ ప్రగతిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించగా ఇది కూడా త్వరలోనే కార్యరూపం దాల్చనుందన్నారు.
సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఎనిమిదేళ్ల కాలంలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని, తెలంగాణ రాక ముందు 12 వేల కోట్ల టర్నోవర్ ఉండగా అది గత ఆర్థిక సంవత్సరానికి 26,500 కోట్లకు చేరిందని, అలాగే ఉత్పత్తి, బొగ్గు రవాణా, లాభాల్లో కూడా మహారత్న కంపెనీలకు ధీటుగా వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. ఇదంతా ఉద్యోగులు, అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. మరో మూడు నెలల్లో ఒడిశా రాష్ట్రంలోనే నైనీ బొగ్గు బ్లాకు నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందనీ దీనితో పాటు ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ప్రయత్నిస్తుందన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో 100 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరడానికి కంకణబద్ధులై కృషి చేయాలని, తద్వారా సింగరేణి 50 వేల కోట్ల టర్నోవర్ ను 3 వేల కోట్లకు పైగా లాభాలను సాధించగలమన్నారు. సింగరేణి ప్రగతికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కంపెనీ కార్మికుల కోసం ప్రకటించారని, వీటిని విజయవంతంగా అమలు జరుపుతున్నామన్నారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కోసం ప్రతీ ఒక్కరూ మరింత అంకితభావంతో పనిచేయాలని, తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో 33 వేల కోట్లకు పైగా టర్నోవర్ ను లాభాలను నమోదు చేయగలుగుతామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ అధికారిగా ఎంపికైన డీజీఎం (మార్కెటింగ్) సత్తు సంజయ్‌ని, స్పోర్ట్స్ సూపర్ వైజర్ షాలెం కుమారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఈడీ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, జీఎం (మార్కెటింగ్) ఎం.సురేశ్, కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.