Wednesday, October 16, 2024

Manikonda: వీధి కుక్కలకు ఆశ్రయం..

నటి అమలకు చెందిన బ్లూ క్రాస్ సంస్థ పరిశీలన
పాల్గొన్న నార్సింగి మున్సిపల్ చైర్మన్, కమిషనర్
వీధి కుక్కల సమస్యపై ‘ఆంధ్రప్రభ’ కథనానికి స్పందన గండిపేట

మ‌ణికొండ‌, జులై 27(ప్రభ న్యూస్): హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరిగిన వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. ఇటీవల మణికొండ చిత్రపురి కాలనీలో ఒక మహిళను 15కు పైగా వీధికుక్కలు చుట్టిముట్టి బీభత్సం రేపాయి. అనంతరం ఇలాంటిదే మరో ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చాలామంది వీధి కుక్కలను చంపేయాలంటూ డిమాండ్లు చేశారు. కానీ, జంతు ప్రేమికులు మాత్రం.. ఎక్కడైనా 4 ఎకరాలు కేటాయించి, వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం, బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు, సినీనటి అమల వంటి వారు చొరవ చూపాలని అభ్యర్థించారు. సినీ పరిశ్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పనిచేసిన ఎంవీ రామక్రిష్ణ స్పందించి ఈ ప్రతిపాదనను చేశారు. పసి పిల్లలపై కుక్కల దాడి పట్ల తీవ్ర ఆవేదన వెలిబుచ్చతూనే.. ఆ చిన్నారుల స్థానంలో ప్రముఖుల పిల్లలు ఉంటే ఇలానే చేస్తారా? అని ప్రశ్నించారు.

బాబాలు, స్వాములకు ఎకరం రూపాయికే కేటాయించే ప్రభుత్వాలు మూగజీవాలకు నాలుగెకరాలు కేటాయించి చుట్టూ ఫెన్సింగ్ వేసి వాటి సంరక్షణ బాధ్యతలను అమల వంటి వారికి అప్పగిస్తే న్యాయం జరుగుతుందన్నారు. దీనిపై ‘ఆంధ్రప్రభ’ కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు నార్సింగి సహా తొమ్మిది మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, బ్లూ క్రాస్ సంస్థను పరిశీలించారు. వీధి కుక్కల సంతాన నిరోధక ప్రక్రియను అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు.

వివిధ మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జంతు సంరక్షకురాలు, బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు, సినీ నటి అమల, నార్సింగి మున్సిపాలిటీ చైర్ పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఏఈ సంజయ్ రెడ్డి, వివిధ మున్సిపాలిటీ ఛైర్మన్లు, కమిషనర్లు, శానిటేషన్ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement