హైదరాబాద్ – తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ తో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద వైఎస్ షర్మిల నిరశన దీక్ష ప్రారంభించారు.. ఈ దీక్ష సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగనుంది. వాస్తవానికి షర్మిల తన దీక్షను 72 గంటల పాటు నిర్వహించాలని భావించారు. కరోనా నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా, తన దీక్షను 72 గంటల నిరాహార దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దీక్ష సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ… ‘ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన వారు విద్యార్థులు.. అలాంటిది ఈ రోజు వారు ఉద్యోగాలు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘మొన్న సునీల్ నాయక్ అనే యువకుడు కాకతీయ యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావు తర్వాతయినా నోటిఫికేషన్లు రావాలని చెప్పాడు. తన తల్లిదండ్రులకు భారమవుతున్నానని సిరిసిల్లలో మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండలో సంపత్ కుమార్ తనకు ఉద్యోగం వస్తుందన్న ఆశ పోయిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని అన్నారు. ‘ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. కేసీఆర్ గారు ఉద్యమం నాడు అన్నమాట ఏంటీ? చందమామ లాంటి మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మరి ఇప్పుడు చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ గారికి కనిపించడం లేదా? ఇంట్లో గడియ వేసుకుని నిద్రపోతున్నారా?’ అని షర్మిల ప్రశ్నించారు.
‘అసలు కేసీఆర్ చాతిలో ఉన్నది గుండెనా? లేక బండరాయా? లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఎందుకు భర్తీ చేయట్లేదు? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఏ ఇతర పార్టీ పోరాటం చేసినా చేయకపోయినా.. యువతకు మద్దతుగా మేము నిలబడతాం’ అని షర్మిల భరోసా ఇచ్చారు. ‘వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందుకు బాధ్యులు ఎవరు? కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. ఉద్యోగాలు భర్తీ చేయాలి. నేను 72 గంటలు నిరాహార దీక్ష చేస్తాను. నాలుగో రోజు నుంచి జిల్లాల్లోనే మా నాయకులు దీక్షలు చేస్తుంటారు. ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం నిద్రలేవాలి’ అని షర్మిల వ్యాఖ్యానించారు. దీక్షా శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుని ఆమెకు మద్దత్తుగా దీక్షలో కూర్చున్నారు..
ఉద్యోగాల భర్తీ కోసం షర్మిల నిరశన దీక్ష ప్రారంభం…
Advertisement
తాజా వార్తలు
Advertisement