హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలే కాదు.. నాలాలు, మ్యాన్ హోల్స్ సైతం పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీల నుంచి వస్తున్న మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. భాగ్యనగరంలోని ఏ ఏరియాలో చూసినా గల్లిలు, మెయిన్ రోడ్లలో ఇదే విధంగా పరిస్థితి కనిపిస్తోంది. కాలనీల్లో నిలిచిన వరద, మురుగు నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ముసురు పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వాటర్‌తో కొన్ని ఏరియాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం, శనివారం కాస్త వర్షం తగ్గినా ఇంకా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
మున్సిపల్ సిబ్బంది తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని 30 డివిజన్లలోనే 45 వేల ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఉప్పల్, కుషాయిగూడ, నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట్, మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మెట్రో మార్గంలో మ్యాన్ హోల్స్ పొంగిపొర్లడం, డివైడర్ల మధ్య వరద నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
శాశ్వత పరిష్కారం ఏది..?
వర్షాలు భారీగా కురిశాయి అంటే మొదట మూసీ నది పొంగిపొర్లడం, మూసారాంబాగ్ బ్రిడ్జ్‌ను ఆనుకొని లేదా పై నుంచి ప్రవహించడం ప్రతి ఏటా జరుగుతూ వస్తుంటుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంటుంది. సైతం పరిస్థితి ఇప్పుడూ పునరావృతం అయ్యింది. చాదర్‌ఘట్, అంబర్‌పేట్‌లోని మూసీని ఆనుకొని ఉన్న ఇండ్ల్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మూసీ నది ప్రవాహం ఎక్కువ కావడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
చాదర్‌ఘట్, నల్లకుంట, అంబర్‌పేట్, రామంతాపూర్, నాగోల్ ఏరియాలోని మూసీ నదికి, నాలాలకు ఆనుకొని ఉన్న నివాసాల్లోని స్థానికులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఏటా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. తమకు శాశ్వత పరిస్కారం అన్నదే లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. భారీ వర్షాలు పడితే తాము నరకం అనుభవించాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తడిచిన గోడలతో మూసిని ఆనుకొని ఉన్న ఇండ్లల్లోని వారు ఎప్పుడూ కూలుతాయోనన్న బెంగతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రాత్రిళ్లంతా జాగారం చేయాల్సి వస్తుందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రాంతాల్లోని ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రాఫిక్‌తో ఇక్కట్లు
నిరంతరం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని పలు ఏరియాలో రోడ్లు కుంగిపోయాయి. మ్యాన్ హోల్స్, పైపై లైన్ వెళ్లే దారుల్లో రోడ్లు గుంతలుగా మారాయి. వాహనాలు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా కుంగిపోవడంతో కొన్ని వెహికిల్స్ అందులో ఇరుకున్నాయి. పై నుంచి వర్షం పడుతుండటం, వరద ప్రవహిస్తుండటం, మధ్యలో వాహనాలు గుంతల్లో చిక్కుకోవడంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం అనుభవించారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, మియాపూర్, కూకట్‌పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఉద్యోగులు, నగర వాసులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిర్లక్ష్యంగా సిబ్బంది.. పని చేయని యంత్రాలు
మున్సిపల్ అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా అధికారులు పర్యావేక్షిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న చోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విరిగిపడిన చెట్లను తొలగించారు. కొన్ని డివిజన్లలో సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే డివిజన్‌ల వారీగా సిబ్బందిని కేటాయించినా విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించారని మండిపడుతున్నారు. జలమండలికి సైతం ఫిర్యాదులు పెరిగాయి. సక్రమంగా నెలకు లక్షన్నరకు పైగా బిల్లులను ఇస్తున్న అధికారులు ఎయిర్ టెక్ యంత్రాలను సరిగా ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పని చేయని వాటిని కూడా పని చేస్తున్నట్లు లెక్కల్లో చూపిన వాహనాలు విధుల్లో లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దోమల బెడదతో రాత్రిళ్లు నరకం
వర్షాలతో నగరంలో దోమల బెడద ఎక్కువైంది. రోజుల తరబడి మురుగు రోడ్లపై ప్రవహిస్తుండటంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. ప్రజారోగ్యం ప్రమాదంలోకి పడబోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధులు సోకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుపుతున్నారు. చెత్త పలు ప్రాంతాల్లో పేరుకుపోయి దుర్వాసనను వెదజల్లుతోంది. దీంతో అంటు వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దోమలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు నిద్రపట్టక జాగారం చేసే కుటుంబాలు వేల కొద్ది ఉన్నాయి. దోమల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.