జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని ఉప్పల్ “A”బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ముందు ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ధర్నాకు శనివారం రజితా పరమేశ్వర్‌రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు.
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. అందరినీ మోసం చేసినట్టుగానే చివరకు పారిశుద్ధ్య కార్మికులను సైతం సీఎం మోసం చేశారని దుయ్యబట్టారు. అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. ప్రజల సంక్షేమం, ఉద్యోగుల అభ్యున్నతి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ, నూతులకంటి రాజ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, బచ్చ రామ్ పాల్గొన్నారు.