Saturday, November 23, 2024

ప్రైవేటు టీచ‌ర్ల‌కు బియ్యం పంపిణీని ప్రారంభించిన మంత్రి స‌బితా….

హైద‌రాబాద్ : ‌రాష్ర్టంలోని ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌ టీచ‌ర్ల‌కు 25 కిలోల చొప్పున రేష‌న్ బియ్యం ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నేడు ప్రారంభించారు. రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని అత్తాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌, ప‌లువురు టీచ‌ర్లు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ర్టంలో ప్రైవేటు టీచ‌ర్ల‌కు ఆర్థిక సాయంతో పాటు రేష‌న్ బియ్యం పంపిణీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌యివేటు స్కూళ్ల‌లో ప‌ని చేసే టీచ‌ర్లు, సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని,. వారి ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ గొప్ప మ‌న‌సుతో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వివ‌రించారు. గ‌తేడాది క‌రోనా వ్యాప్తి మొద‌లైనప్పుడు వ‌ల‌స కార్మికుల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా నిలిచారు. వారికి న‌గ‌దు అంద‌జేసి, రేష‌న్ బియ్యం ఉచితంగా ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇక రాష్ర్టంలో వైట్ రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఆర్థిక సాయంతో పాటు రేష‌న్ బియ్యాన్ని ఉచితంగా అంద‌జేశామ‌న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌యివేటు టీచ‌ర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఈ విడ‌త‌లో ఒక ల‌క్షా 24 వేల మందికి 25 కిలోల రేష‌న్ బియ్యం ఇవ్వ‌బోతున్నామ‌ని తెలిపారు. నిన్న ఒక్క‌రోజే ఒక ల‌క్షా 12 వేల మంది టీచ‌ర్ల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున న‌గ‌దు జ‌మ చేశామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement