Friday, November 22, 2024

TG | దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎస్​, డీజీపీ

తెలంగాణ దశాబ్ది వేడుకలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2న ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించి, పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ గీతాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, ఈ వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరేడ్ గ్రౌండ్‌లో రిహార్సల్స్‌ను వీక్షించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ రవిగుప్తాతో పాటు సీఎస్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోలీసు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలను సన్మానించనున్నారు.

వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ గ్రౌండ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా కళ్లు చెదిరే పోలీసు కవాతు కోసం భద్రతా బలగాలు వారాల తరబడి రిహార్సల్స్ చేస్తున్నాయి. ఇందులో విద్యార్థులతో పాటు ఆక్టోపస్ బలగాలు, టీఎస్‌ఎస్పీ బెటాలియన్, ఏఆర్, కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులు పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement