హైదరాబాద్ : రేవంత్ ప్రభుత్వం కరెంటు విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిననే సోయి లేకుండా బాధ్యతా రాహిత్యంతో విద్యుత్ శాఖకు చెందిన చిన్న స్థాయి ఉద్యోగులపై లేనిపోని న్యాయ విరుద్దమైన నీతిమాలిన అభాండాలు వేస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, నిర్లజ్జగా తన అసమర్ధతను కప్పి పుచ్చుకుంటుండన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో లేని కరెంటు కోతలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా రేవంత్ రెడ్డి చిన్న ఉద్యోగులపై బట్ట కాల్చి మీదవేయడం తప్పు అన్నారు. ఏది మాట్లాడినా చలామణి అవుతుందనే రేవంత్ రెడ్డి అధికార దురహంకారాన్ని తీవ్రంగా ఖండించండన్నారు. విద్యుత్ శాఖలో హెల్పర్లు, లైన్ మెన్ ఇంకా చిన్న ఉద్యోగులు స్వతహాగా పేద వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ పెద్ద అయిన రేవంత్ రెడ్డి చిన్న ఉద్యోగుల పట్ల వివక్షతో చిన్నచూపు చూడటం సామాజిక నేరమన్నారు. రేవంత్ రెడ్డి తన నిరాధార అహంకార వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, చిన్న ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నానన్నారు.
అయిదు నెలల్లోనే ప్రజలు జెనరేటర్స్, ఇన్వెర్టర్స్ ఎందుకు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అనేక ఇళ్లల్లో టీవీలు, ఫ్రిడ్జులు, వ్యవసాయ మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయని, రేవంతరెడ్డి ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నానన్నారు. రేవంత్ ప్రస్తుతం తెలంగాణాలో అన్నిరకాల విద్యుత్ ఉత్పత్తి ఎంత ? కొనుగోళ్లు ఎంత ? వినియోగం ఎంత ? ఇంకా అనేక వివరాలు ప్రజల ముందుంచాలన్నారు.