Friday, November 22, 2024

Revanth America Tour – హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్

ఈ ఏడాది చివర్లో ప్రారంభం..
మూడు వేల మందికి ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – కాలిఫోర్నియా . . ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్‌జెన్ (Amgen Inc) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్‌లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉన్నతాధికారుల బృందం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో ఆ కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.

- Advertisement -

ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.

అంతకుముందు ఆమ్‌జెన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్పూర్తిదాయకమైనదని సీఎం పేర్కొన్నారు.

బయో టెక్నాలజీ రంగంలో గడిచిన 40 ఏళ్లుగా తాము అగ్రగామి సంస్థగా కొనసాగుతున్నామని ఆమ్‌జెన్ సంస్థ ఎండీ డాక్టర్ రీస్ అన్నారు. డేటా సైన్స్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో మరిన్ని సేవలు అందించాలనే హైదరాబాద్ లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని, బయోటెక్ రంగంలో ఇదొక అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆమ్‌జెన్‌ ఇండియా తన కొత్త రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకోవటం ఆనందంగా ఉందని, దీని ద్వారా ప్రపంచ స్థాయిలో లైఫ్ సైన్సెస్ రంగానికి పూర్తి అనువైన ప్రాంతం హైదరాబాదే అని మరోసారి రుజువైందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఆమ్ జెన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపు 27 వేల మంది ఉద్యోగులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement