హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తించడం రిపబ్లిక్ ఇండియా లక్ష్యమని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన జెండావందనం వేడుకల్లో దాసోజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ప్రజల చేతికి ఇవ్వడమే రిపబ్లిక్ వ్యవస్థ అన్నారు. అనేక మంది మహనీయుల త్యాగఫలం నేటి మన రిపబ్లిక్ భారతమని, దేశ ప్రజల భవిష్యత్ బావుండాలి, భవిష్యత్ తరాలు ఉన్నంతగా ఉండాలన్నారు. దేశం బలోపేతం కావాలనే గొప్ప ఉద్దేశంతో నాడు ఆ మహానీయలు త్యాగాలు చేస్తే.. నేడు బ్రతికుండి మనం దేశాన్ని, వ్యవస్థని బలహీన పరుచుకుంటున్నామన్నారు. ఎంతసేపు హక్కులు గురించి మాట్లాడుతున్నామే కానీ బాధ్యతలు గుర్తిస్తున్నామా అని ప్రశ్నించారు.
ఓటువేయడానికి బద్దకించే స్థితిలో నేడు సమాజం ఉందన్నారు. డబ్బుకు అమ్ముడుపోయి ఓటు వేసే పరిస్థితి. మద్యానికి, మాంసానికి, చిన్నచిన్న తాయిలాలకు, ప్రలోభాలకు లోబడి ఓటుని వాడుకుంటున్నామని, ఓటుని తాకట్టు పెడుతున్నామన్నారు. మన బాధ్యతలను విస్మరిస్తున్నామని, తద్వారా హక్కులు కోల్పోతున్నామన్నారు. నేడు ప్రతి గల్లీలో జెండా ఎగరుస్తున్నాం. బాపూజీ, అంబేద్కర్ కి దండలు వేస్తున్నాం.. జైహింద్ నినాదాలు చేస్తున్నాం.. జెండావందనం చేస్తున్నాం.. ఇదే దేశభక్తి అని సంకలు గుద్దుకుంటున్నాం.. కానీ అసలైన బాధ్యతలను మాత్రం విస్మరిస్తున్నామన్నారు. ఏ లక్ష్యంతో మహనీయులు ఆత్మత్యాగాలు చేశారో, ఏ లక్ష్యంతో రిపబ్లిక్ దేశం ఏర్పడిందో.. ఆ లక్ష్యం వైపుగా మనం నడుస్తున్నామా లేదా ? అనే ఆత్మ విమర్శ చేసుకోవాలని దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.