హైదరాబాద్ : మీడియా రంగంలో తిరుగులేని వ్యక్తి, తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాటంలో చురుకైన కార్యకర్త అయిన చెరుకూరి రామోజీ రావు ఆకస్మిక మరణం చాలా బాధాకరమని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ కటారు రవికుమార్ రెడ్డి తెలిపారు. భారతీయ వ్యాపారవేత్త, మీడియా వ్యవస్థాపకుడు, చలనచిత్ర నిర్మాత, చెరుకూరి రామోజీ రావు ఓ మహోన్నత వ్యక్తి అన్నారు.
రామోజీ గ్రూప్ అధినేతగా ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ టీవీ నెట్వర్క్, ఉషా కిరణ్ మూవీస్ సంస్థలను కలిగి ఉండటంతో పాటు పద్మ విభూషణ్, జాతీయ చలనచిత్ర అవార్డులను కలిగి ఉన్నారన్నారు. అతని అంకితభావం, వృత్తి నైపుణ్యం, వినయాన్ని అభినందిస్తున్నానన్నారు. ప్రత్రికల్లో తప్పుడు సమాచారం లేకుండా చేయటంతో పాటుగా ప్రత్రికా స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా ఆయన పనిచేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహోద్యోగులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.