Saturday, November 23, 2024

క్వారంటైన్ హోట‌ల్స్ కు ఫుల్ డిమాండ్….. ల‌క్ష‌ల్లో బిల్లుల మోత‌

హైదరాబాద్‌, : క్వారంటైన్‌ హోటల్స్‌కు మరోసారి గిరాకీ పెరిగింది. గతేడాది కరోనా పేరుతో దోచుకున్న క్వారంటైన్‌ హోటల్స్‌ మళ్లి ఈ సెకండ్‌ వేవ్‌కు అంతకుమించి వసూళ్లకు తలుపులు తెరిచాయి. క్వారంటైన్‌ పీరియడ్‌ 14 రోజు లకుగానూ దాదాపు రూ.లక్ష వరకు హైదరాబాద్‌లోని కొన్ని హోటల్స్‌ ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు, కరోనా సోకిన వ్యక్తికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఉన్న వాళ్లు, విదేశీ ప్రయాణాలు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్లు ఈ క్వారంటైన్‌ హోటల్స్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా క్వారంటైన్‌ కల్పించే హోటల్స్‌ వైద్య సేవలను అందిస్తున్నాయా లేదా అన్న ప్రశ్నతో పాటు భోజనవసతిపై పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతొ పాటు అసలు హైదరాబాద్‌లో ఇలాంటి హోటల్స్‌ ఎన్ని ఉన్నాయనే చర్చ జోరుగా నడుస్తుండడం గమనార్హం.
ఒక వ్యక్తికి రోజుకు దాదాపు రూ.7 వేల వరకు బిల్లు వేస్తున్నారు. అలా అని ఈ హోటల్స్‌ లగ్జరీ సేవలు అందించడంలేదు. కేవలం క్వారంటైన్‌ అరకొర సదుపా యాలతో సౌకర్యాలు అందించి రూ.లక్షలు దండుకుంటున్నాయని విమర్శలు వస్త్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో క్వారంటైన్‌ నిబంధనలు లేవు. కరోనా పాజిటివ్‌ వచ్చినా, విదేశీ ప్రయాణాలు చేసి కరోనా అనుమానిత వ్యక్తులుగా ఉన్నా హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. కానీ కొంతమంది మాత్రం కుటుంబ సభ్యులకు, ఇంట్లో వృద్దులు, చిన్న పిల్లలకు వైరస్‌ సోకే ప్రమా దం ఉండడంతో క్వారంటైన్‌ కోసం ఇలాంటి హోటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన హోటల్స్‌ వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇలానే ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కి వచ్చాడు. హైదరాబాద్‌ నుంచి అతడు ఏపీకి వెళ్లాలి. అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాకున్నా ముందు జాగ్రత్తతో హైదరాబాద్‌లోనే ఓ క్వారంటైన్‌ హోటల్‌లో వారం రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ వారం రోజులకు రూ.60 వేల రూపాయల బిల్లు అతనికి వేసినట్లు తెలిసింది. అడిగితే ఆక్సిజన్‌ సౌకర్యం, 24 గంటలు అందుబాటులో కేర్‌టేకర్‌ని ఉంచుతున్నామని చెబుతున్నారు. కరోనాకు సంబంధించి అన్ని విభాగాల్లో జాగ్రత్తలు తీసకుంటూ, గైడ్‌ లైన్స్‌ ఇస్తున్న ప్రభుత్వాలు క్వారంటైన్‌ పేరిట దోచుకుంటున్న ఈ హోటళ్లను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement