Wednesday, October 23, 2024

HYD: హాస్యబ్రహ్మ శంకర నారాయణ రచించిన పుష్ప విలాసం ఆవిష్కరణ

ఆంధ్ర‌ప్ర‌భ, హైద‌రాబాద్ : కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్పాల బాధలను వర్ణిస్తూ అద్భుతంగా పుష్ప విలాపం కావ్యాన్ని రాస్తే, ఆ ప్రభావంతో వైవిధ్యంతో పుష్పాల వైభవాన్ని హాస్యబ్రహ్మ శంకర నారాయణ పుష్ప విలాసం గొప్పగా రాశారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రశంసించారు. రెండర్ధాలు ఉండే పన్ తో ఫన్ గన్, పన్ పరాగ్, ఫన్ దేహాలు వంటివి రాసి శంకర నారాయణ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని చెప్పారు. రమ్య ఆధ్వర్యంలోని రాగ రమ్య సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతి ప్రధాన వేదిక మీద ఏర్పాటు చేసిన ముత్యాల జల్లు కురిసె కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి పుష్ప విలాసం గ్రంధాన్ని మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.

సంగీత, నృత్య, సాహిత్యాలను మేళవిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో బాల బాలికలు చక్కటి ప్రదర్శనలు చేశారని, ఇందుకు వారితో పాటు, వారి తల్లి దండ్రులను కూడా అభినందిస్తున్నానని చెప్పారు. సాంస్కృతిక రంగంలో 5సంవత్సరాల నుంచి మంచి సేవ చేస్తున్న రాగ రమ్య సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుందని హరికృష్ణ అన్నారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ రాగరమ్య వ్యవస్థాపకురాలు రమ్యను, పుష్పవిలాసం శతకం రచించిన శంకర నారాయణను, సంగీత, నృత్య ప్రదర్శనలిచ్చిన బాల బాలికలను అభినందించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాల బాలికలు ప్రదర్శనలతో ప్రేక్షకుల మెప్పు సంపాదించారు.

పుష్ప విలాసం గ్రంధాన్ని అంకితం పుచ్చుకున్న పాటల రచయిత, స్వర కర్త రాయారావు విశ్వేశ్వర రావును మామిడి హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. సంగీత, నృత్య గురువులు డాక్టర్ భవాని విజయ్, శిరీషా దేవి,రాణిప్రియ, జానకి, పద్మ భారతి శర్మ, రేవంతి,మహంతి అనిత,అనురాధ, హేమ వన సర్గ, అపర్ణ, వాసంతి శర్మ,గౌతమి, లక్ష్మి ఆత్మీయ అతిధులగా పాల్గొన్నారు. ప్రేక్షకులతో రవీంద్ర భారతి మెయిన్ హాలు కిటకిటలాడడం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement