Monday, December 23, 2024

బుక్‌ ఫెయిర్‌లో ఆకట్టుకున్న పురాణపండ అదివో.. అల్లదివో.!

  • భరణి ఆటకదరా శివాకి జయహో.!
  • కవి యాకూబ్‌కి జయహోలు.!!

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : వచన కవిత్వాలు, పద్యకావ్యాలు, సంస్కృత గ్రంథాలు, పురాణేతిహాసాలు, జ్ఞాన ఫలాలను వర్షించే నీతికథలు, ఆత్మకథలు, సత్యాన్వేషణ గ్రంథాలు, మనస్తత్వాల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు, వైజ్ఞానిక గ్రంథాలు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో వేలు, లక్షల గ్రంథాలు వందలాది బుక్స్‌ స్టాల్స్‌గా అవతరించి నాలుగు రోజులు దాటుతున్నా నానాటికీ పాఠకులు పెరిగి హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియమంతా ఆదివారం జనం ప్రభంజనమై వేలాది పుస్తకాలని కొనుగోలు చేశారు.

38వ పుస్తక ప్రదర్శన ప్రారంభ వేడుకలో ప్రముఖ కవి, బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు యాకూబ్‌ ప్రసంగం తెలంగాణా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని ఆకట్టుకుందనేది అన్నివర్గాల ప్రజలు, కవులు, కళాకారుల, మేధావుల అభిప్రాయంగా చెప్పక తప్పదు. గతంలో కంటే ఈసారి కవులు, కవయిత్రులు, రచయిత్రులు స్వయంగా బుక్‌ స్టాల్స్‌ని నిర్వహించడం, తామే స్వయంగా దగ్గరుండి పుస్తక విశేషాలను వివరించి పాఠకులకు అమ్మడం ఒక విశేషంగా కనిపిస్తోంది.

అక్షరయాన్‌, అచ్చంగా తెలుగు ప్రచురణలు, తెలంగాణ సాహిత్య అకాడమీ, వావిళ్ళ వారి ప్రచురణలు, ఛాయ ప్రచురణలు, అన్వేక్షి పబ్లికేషన్స్‌, నవోదయ బుక్‌ హౌస్‌, నవచేతన బుక్‌హౌస్‌, ఆదర్శిని మీడియా, వీక్షణం, ప్రజాతంత్ర, ఋషిపీఠం ప్రచురణలు, తెలంగాణ పబ్లికేషన్స్‌, నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌, తెలుగు తునకలు, మాస్టర్‌ ఆర్కే బుక్స్‌, గొల్లపూడి వీరాస్వామి సన్‌, మోహన్‌ పబ్లికేషన్స్‌.. ఇలా ఎన్నో స్టాల్స్‌లో ప్రతీ అరగంటకు ఒక సాహితీ ప్రముఖుడో, విఖ్యాత కవో కనిపిస్తూనే ఉన్నారు.

డిసెంబర్‌ 19 సాయంత్రం ప్రారంభమైన ఈ పుస్తక వేడుక నాటి నుంచి ఉభయ రాష్ట్రాల కవి ప్రముఖులు వాడ్రేవు చినవీరభద్రుడు, యాకూబ్‌, శివారెడ్డి, అందెశ్రీ, నందిని సిధారెడ్డి, ఆర్‌.హరగోపాల్‌, సతీష్‌చందర్‌, మామిడి హరికృష్ణ, ముదిగొండ శివప్రసాద్‌, పురాణపండ శ్రీనివాస్‌, నాళేశ్వరం శంకరం, ఓల్గా, సజయ, కుప్పిలి పద్మ, ఐనంపూడి శ్రీలక్ష్మి, చంగలువల కామేశ్వరి, వఝల శివకుమార్‌, మానస ఎండ్లూరి, ఒమ్మి రమేష్‌బాబు, అరుణాంక్‌ లత, అరణ్య కృష్ణ, దర్శకుడు వంశీ, మహమ్మద్‌ ఖదీర్‌ బాబు, కరుణకుమార్‌, స్వర్ణ కిలారి, విస్వ్యక విశ్వ, రోహిణి వంజారి, పద్మిని ప్రియదర్శిని, కవిత చక్ర, కడలి, మహి బెజవాడ, వెంకట్‌ సిద్హారెడ్డి ఇలా ఎందరో కవులు ఈ జాతీయ పుస్తక ప్రదర్శనలో పాల్గొని బుక్స్‌ని కొనుక్కోవడమే కాకుండా, ఎన్నో కవిత్వ సాహిత్య ముచ్చట్లను చర్చించుకుని అలయ్‌బలయ్‌తో ఆత్మీయంగా గడపడం ఒక ముచ్చటగా, గొప్ప జ్ఞాపకంగా మిగలడం ఖాయమంటున్నారు సాహిత్యకారులు.

ఈసారి పుస్తక మహోత్సవానికి స్ఫూర్తిగా పాల్గొన్న ట్రాన్స్‌జండర్లు రచన ముద్రబోయిన, నందితలు బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు యాకూబ్‌తో కాసేపు బుక్స్‌ గురించి చర్చించడం యాకూబ్‌ సహృదయానికి అద్దం పట్టింది. మరొక ముఖ్యాంశమేంటే విఖ్యాత నటుడు, పరమశివభక్తుడు తనికెళ్ళ భరణి అద్భుత రచన ఆటకదరా శివా శివతత్వాల అందమైన పుస్తకాన్ని ఈసారి ఎందరో సాహితీవేత్తలు, కవయిత్రులకు ఈ బుక్‌ ఎగ్జిబిషన్‌లో ఉచితంగా అందించడంతో, ప్రాంగణంలోనే చాలామంది ఆ గ్రంథాన్ని చదువుతూ మురిసి పోవడం కనిపించింది. మరొకపక్క ఈ ఆటకదరా శివా రెండుమూడు పుస్తకశాలల్లో అమ్ముతున్నారు.

- Advertisement -

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేవీ.రమణాచారి ప్రోత్సాహంతో ప్రముఖ కవయిత్రి మంజులా సూర్య సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ పరమాద్భుతంగా రచనా సంకలనంగా అందించిన రమణీయ శివోపాసనాగ్రంథం శివోహంతో పాటు-, తిరుమల వేంకటాచల క్షేత్రంపై అమోఘ సౌందర్యాలను వర్షిస్తూ భక్తికి పరాకాష్టగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ రచించిన అదివో.. అల్లదివో.. గ్రంథానికి అనూహ్య స్పందన లభించడం విశేషం. అదివో.. అల్లదివో కొన్ని గ్రంథాలనుకొని మరీ చెంగలువల కామేశ్వరి అక్కడి లేఖిని బృందంలో సుమారు యాభైకి పైగా రచయిత్రులు, కవయిత్రులకు పంచిపెట్టడం రసజ్ఞులను విశేషంగా ఆకర్షించింది.

పరమ పవిత్రగ్రంథ రచనా వితరణోద్యమంలో ఈసారి ఇక్కడ కూడా పురాణపండ శ్రీనివాస్‌దే పైచేయి కావడం ఆశ్చర్యకరం. శ్రీనివాస్‌ గ్రంథాల సమ్మోహనత్వం అలాంటిదని కొమ్ములు తిరిగిన సాహిత్యవేత్తలు పేర్కొనడం గమనార్హం. నచ్చిన పుస్తకాలతో, ప్రభావితం చేసిన పుస్తకాలతో, మెచ్చిన పుస్తకాలతో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ దాశరధి కృష్ణమాచార్యుల ప్రాంగణం అద్భుత చర్చలతో మెరిసిపోతోంది.

తెలుగు ఆధ్యాత్మిక గ్రంథాల అమ్మకాల్లో రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఉషశ్రీ, దాశరధి రంగాచార్య, చాగంటి కోటేశ్వరరావు, పురాణపండ రాధాకృష్ణమూర్తి, సామవేదం షణ్ముఖశర్మ, వద్దిపర్తి ప్రభాకర్‌ తదితర ఆధ్యాత్మికవేత్తల గ్రంథాలు పాఠకుల చేతుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక కవి, రచయిత, విమర్శకుడు యాకూబ్‌లాంటి మానవ విలువల వ్యక్తిని బుక్‌ ఫెయిర్‌ కి అధ్యక్షుడిగా నియమించడంతో సాహిత్య ఆధ్యాత్మిక కవిత్వ వాతావరణంలో చక్కని ఉత్తేజం కనిపిస్తోందనడంలో సందేహాలనవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement