85 ఏళ్ల వయసులో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ సౌందరరాజన్ ‘సంప్రదాయ సంరక్షణ దీప’ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. రాజకీయ, వాణిజ్య అంశాలకు వ్యతిరేకంగా ఆలయ వ్యవస్థను సంరక్షించడం ద్వారా ధర్మ రక్షణలో సౌందరరాజన్ చేసిన నిరంతర సేవలకు ఈ బిరుదును ప్రదానం చేశారు. శ్రీ గోపాలదేసికా మహదేశికన్ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీరంగంకు చెందిన పౌండరీకాపురం శ్రీమద్ అండవన్ ఆశ్రమ నిర్వాహకులు ఈ బిరుదుతో సౌందరరాజన్‌ను సత్కరించారు.
చిలుకూరు ఆలయంలో హుండీ సంప్రదాయాన్ని తొలగించిన ఘనత సౌందరరాజన్‌కు దక్కుతుంది. వీఐపీ దర్శనం అనేది లేకుండా భక్తులందరికీ ఒకే క్యూ లైన్‌లో దర్శనం కల్పించారు. టికెట్ విధానం లేకుండా, ఆర్జిత సేవలు లేకుండా, నగదు సమర్పణలు లేకుండా చిలుకూరు ఆలయంలో సౌందరరాజన్ పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. కాగా ఎంకామ్, ఎల్ఎల్‌బీ, కామర్స్‌లో డాక్టరేట్ పొందిన సౌందరరాజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1981లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. వంశపారంపర్య క్రమంలో ఆలయ ధర్మకర్తగా, అర్చకుడిగా ఉంటూ సౌందరరాజన్ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు.