Friday, November 22, 2024

పద్మావతిని స‌త్క‌రించిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

ఖ‌మ్మంకు చెందిన ప‌ద్మావ‌తి ఇటీవలే మూడోసారి అవార్డు అందుకుంది. రెండేళ్ల వయసులోనే ఆమె పోలియోతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఎనిమిది ఆపరేషన్ల అనంతరం క్యాలిపర్స్, కర్రల సాయంతోనే నడిచేవారు. పట్టుదలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దాసరి నారాయణరావు పాటల పోటీల్లో పాల్గొనడానికి 1995 లో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చాక వంశీ ఆర్ట్ థియేటర్లో చేరి పౌరాణిక పద్య నాటకాలు నేర్చుకున్నారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు, పాండురంగడు పాత్రలు వేశారు. శ్రీకృష్ణతులాభారంలో సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది . దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. పూర్తిగా నిలబడలేకపోయినా.. రెండున్నర గంటలపాటు కర్రల సాయంతోనే కదులుతూ నవరసాలు పలికించేవారు. కళారంగంలో ఈమె ప్రతిభకు గుర్తింపు లభించింది. మొదటిసారి 2009లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2011లో మహిళ‌ కళాకారిణిగా రాణిస్తున్నందుకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా స్త్రీ శక్తి పురస్కారం అందుకున్నారు. మూడోసారి రాష్ట్రపతి చేతుల మీదుగా 2022 డిసెంబరు 3న అవార్డును అందుకున్నారు. కళాకారిణిగా ఉంటూ వ్యక్తిగతంగా చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా సర్వశ్రేష్ట దివ్యాంగన్ గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

ఈసంద‌ర్భంగా దివ్యంగురాలైన సర్వజ్యేష్ఠ పద్మావతిని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ వాస్తు నిపుణులు కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ కృష్ణాదిశేషుతో కలిసి హయత్ నగర్ లో ఉంటున్న పద్మావతి నివాసానికి వెళ్లి కలిసి వారికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. దివ్యంగురాలైనప్పటికీ దిగులు చెందక పద్మావతి తను ఎంచుకున్న కళతో పాటు తనలాంటి వారికి సహాయం చేస్తుండటం అభినందనీయం, స్ఫూర్తిదాయకమ‌న్నారు. ఆశ్రమంలో ఆమె చేస్తున్న సేవలకు, ప్రతిభకు ముగ్దుడై ఉప్పల శ్రీనివాస్ ఫౌండేషన్ తరుపున వెంటనే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కృష్ణాదిశేషు మాట్లాడుతూ.. అన్నివిధాల సౌకర్యాలు సదుపాయాలు ఉన్నా కొన్ని సంధార్భాల్లో యువత నిరాశ, నిస్పృహలకు లోనై బంగారం లాంటి జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. అటువంటి వారికి పద్మావతి ఆదర్శం, రోల్డ్ మోడల్ అన్నారు. పద్మావతి మాట్లాడుతూ… కృష్ణాదిశేషుతో శ్రీనివాస గుప్తా తమ ఇంటికివచ్చి అభినందించడమే కాక ఆర్ధికంగా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్నోరకాలుగా రాష్ట్రాన్ని ప్రగతి పధంలోకి తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం తమలాంటి వారికి కూడా అండగా నిలిస్తే అదొక వరంగా భావిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement