Saturday, November 23, 2024

మహోన్నత వ్యక్తి నటుడు నాగయ్య : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

తొలితరం నటుడుగా, నిర్మాతగా, గాయకుడుగానే కాకుండా పలువురు ప్రముఖులచే నీరాజనాలు అందుకున్న మహోన్నత వ్యక్తి చిత్తూరు నాగయ్య అని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా అన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నాగోల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్తూరు నాగయ్య 119వ జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శతాబ్ద కాలం నాటి నటులను.. వారి సేవలను గుర్తు పెట్టుకొని జయంతి సభ నిర్వహించడం ద్వారా అలాంటి మహానుభావుల సేవలు ఇప్పటి తరానికి తెలుస్తుందన్నారు. నాగయ్య నటుడుగా త్యాగయ్యగా, పోతనగా జీవించారన్నారు. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు కావడం తెలుగు వారిగా మనందరికీ గర్వ కారణమ‌న్నారు. ప్రముఖ సినీ విశ్లేషకులు ఎస్.వి.రామారావు నాగయ్య జీవిత విశేషాలను వివరించారు. ఆయన ఎంత గొప్ప నటుడో అంత గొప్ప గాయకుడు అన్నారు. కర్ణాటక, హిందు స్థానిక సంగీతాన్ని ఆయన గొప్ప ప్రతిభావలి అన్నారు. అలనాటి గృహలక్ష్మి చిత్రం కోసం ఆయన పాడిన సందేశాత్మక గీతం ‘కల్లు మానండోయి బాబు కళ్ళు తెరవండోయి ‘ అనే పాట ఇప్పటికీ తెలుగు వారికి సుపరిచితమ‌న్నారు. కార్యక్రమానికి ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో.. ఐవీఎఫ్ స్టేట్ మీడియా కమిటీ చైర్మన్ గంగిశెట్టి రఘు, డా.చైతన్య, వేముల అనిల్, ఆకృతి సుధాకర్, అభ్యుదయ కళా సమితి భాస్కరశర్మ, నటులు జి.వెంకటేశ్వర్లుతో పాటు పలువురు కళాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement