హైదరాబాద్ – టిఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ ఘటనలో ఆ సంస్థ ఛైర్మన్, సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు నిరుద్యోగ మార్చ్ పేరుతో ఆందోళనకు శ్రీకారం చుట్టారు.. ఈ నేపథ్యంలో పలువురి విద్యార్థి నాయకులను పోలీసులు వసతి గృహల్లోకి వెళ్లి మరీ ముందస్తు అరెస్టులు చేశారు. వారిని ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దీనిపై రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ భీంరావు నాయక్ మాట్లాడుతూ, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. 30 లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఆవేదనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి మూల కారకులైన ఛైర్మన్, సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
“పేపర్ లీకేజీ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇందులో ఆరోపణలు వస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాలి. అన్యాయంగా ఓయూ హాస్టల్‌కు వచ్చి మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు. రేపటి నుంచి అన్ని యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం”.- విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు..
ఇదిఇలా ఉంటే ఉస్మానియా విశ్వవిద్యాయం విద్యార్థి ఐకాస చేపట్టిన నిరుద్యోగ మార్చ్‌కు సంఘీభావంగా పాల్గొననున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. రేవంత్ రెడ్డి సహా అద్దంకి దయాకర్, మల్లు రవి, పలువురు విద్యార్థి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. తనిఖీ చేశాకే ఆ దారిలోకి అనుమతిస్తున్నారు.
ప్రతిపక్షాలపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. వరసగా రెండో రోజూ గృహ నిర్బంధం చేయడమేంటని నిలదీశారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
“ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రెండో రోజు వరుసగా పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది. నిందితులను వదిలేసి.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తోంది. ఒక వైపు కేంద్రం రాహుల్‌గాంధీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను మాట్లాడకుండా ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ ప్రభుత్వం బాధితుల పక్కన ఉండాల్సింది పోయి.. నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తోంది. అంటూ అద్దంకి మండిపడ్డారు.