Saturday, November 23, 2024

రికార్డు స్థాయిలో ఎన్‌.టీ.ఆర్‌ స్మారక నాణం అమ్మకాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్మారకార్థం కేంద్రప్రభుత్వం తయారు చేసిన స్మారక నాణం రెండున్నర నెలల్లో 25 వేలు విక్రయించడం దేశంలోనే సరికొత్త రికార్డు అని మింట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.ఎన్‌.ఆర్‌.నాయుడు చెప్పారు. ఎన్టీఆర్‌ సెంటినరీ కమిటీ- చైర్మన్‌ టీ.డీ.జనార్దన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్‌ మింట్‌ అధికారులు వి.ఎన్‌.ఆర్‌.నాయుడు, శ్రీనివాస్‌ గండపనేడు, తానాజీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైందని, మొదట జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేయడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు రికార్డు అని, ఆ రికార్డును ఎన్‌.టీ.ఆర్‌ స్మారక నాణం బ్రేక్‌ చేసిందని చెప్పారు. ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని, 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు.

కేవలం రెండున్నర నెలల్లోనే 25 వేల స్మారక నాణేలను విక్రయించడం జరిగిందని చెప్పారు. కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్దన్‌ మాట్లాడుతూ, అన్న ఎన్‌.టీ.ఆర్‌ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పారు. ఎన్టీఆర్‌ శతాబ్ది సంవత్సరంలో తమ కమిటీ, ఎన్టీఆర్‌ శాసన సభ ప్రసంగాలు, ఎన్‌.టీ.ఆర్‌ చారిత్రిక ప్రసంగాలు, శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించామని పేర్కొన్నారు.

విజయవాడ, హైదరాబాద్‌లో రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అర్పించామని, ఇప్పుడు ఆయన పేరుతో తయారు చేసిన స్మారక నాణం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిసి ఎంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చేయగా, అందులో ఎన్టీఆర్‌ స్మారక నాణం ప్రథమ శ్రేణిలో ఉండటం తమకు గర్వకారణమని, ఇది గిన్నెస్‌ రికార్డు సృష్టించాలని కోరుకుంటు-న్నామని జనార్దన్‌ చెప్పారు.

- Advertisement -

శ్రీనివాస్‌ గుండపనేడు మాట్లాడుతూ, రామారావు అంటే మా అందరికీ అభిమానం, కేంద్రం ఆయన స్మారక నాణం విడుదల చెయ్యాలని సంకల్పించిందని మాకు సమాచారం రాగానే హైదరాబాద్‌ మింట్‌లో పనిచేసే తమకు ఎంతో సంతోషం కలిగిందని, ఎందుకంటే ఇది హైదరాబాద్‌లో తయారు కాబోతున్న తొలి నాణం, తమ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నాయుడు పర్యవేక్షణలో అనేక నమునాలను చేసి అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేయడం జరిగిందని, ఇది అందరికీ నచ్చడం మాకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు.

తానాజీ మాట్లాడుతూ, తాను తెలుగు వాడిని కాదని, అయినా రామారావు గురించి విన్నానని, ఆయన స్మారక నాణం హైదరాబాద్‌ మింట్‌ నుంచి వస్తున్నదంటే ఎంతో మంది దృష్టి ఉంటు-ందని, అందుకే ఎలాంటి విమర్శలు, అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, తమ కృషి ఫలించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ- సభ్యులు కంఠంనేని రవి శంకర్‌, భగీరథ, విక్రమ్‌ పూల, దొప్పలపూడి రామ్‌ మోహన్‌, మండవ సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement