హైదరాబాద్, జులై 22 (ప్రభ న్యూస్) : గత ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కురుస్తున్న వర్షాలకు ఏర్పడుతున్న వరదల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నిండు కుండలా ఉండడంతో శనివారం మంత్రి తలసాని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ జియా ఉద్దీన్, లేక్ సీఈ సురేష్ కుమార్, ఎస్.సి. ఆనంద్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డి.సి తిప్పర్తి యాదయ్య లతో కలిసి హుసేన్ సాగర్ ఎఫ్.టి.ఎల్ లెవెల్ తో పాటుగా విడుదల చేస్తున్న నీటిని హోటల్ మారియెట్ నుండి మంత్రి తలసాని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… నగర వాసులకు వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 428 ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు పనిచేస్తున్నాయన్నారు. జిహెచ్ఎంసి, పోలీస్, డిఆర్ఎఫ్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సమన్వయంతో పనిచేయడం మూలంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తక్షణమే ఈ బృందాలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటల పాటు పనిచేసే విధంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం, ఈవీడీఎం బుద్ధ భవన్ లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
నగర ప్రజలకు వరద ఇబ్బందులు గురికాకూడదని దూర దృష్టితో మంత్రి కేటీఆర్ నాలా అభివృద్ధి కోసం ఎస్.ఎన్.డి.పి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఎస్.ఎన్.డి.పి ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన పనుల వలన గతంలో కంటే వరద ముప్పు ఎక్కువ లేదన్నారు. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో నాలా పై అక్రమ నిర్మాణాలు ఉండడం మూలంగా ముంపు ఏర్పడిందన్నారు. ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా జిహెచ్ఎంసి ఎమర్జెన్సీ బృందాలు డీఆర్ఎఫ్, పోలీస్ శాఖ అహర్నిశలు కష్టపడుతూ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారని వారందరికీ మంత్రి తలసాని అభినందనలు తెలిపారు.
వర్షాలు తగ్గిన తర్వాత నాలా అక్రమాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. రసూల్ పుర, మినిస్టర్ రోడ్, ముషీరాబాద్ లలో నిర్మించిన బ్రిడ్జిల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కాలేదన్నారు. ఎస్.ఎన్.డి.పి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఇంకా రెండు రోజులు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని, ఇబ్బందులు ఎదురైనప్పుడు కంట్రోల్ రూమ్ కు తెలియ జేయాలని మంత్రి నగర ప్రజలను కోరారు. అనంతరం మంత్రి తలసాని హుస్సేన్ సాగర్ కాలువ నీటి ఉధృతిని కవాడిగూడ (భాగ్య లక్ష్మి టెంపుల్) వద్ద అశోక్ నగర్ వద్ద మంత్రి పరిశీలించారు.